విశ్లేషణ: ఇద్దరూ మేధావులే!

పవన్ కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన జనసేన వారాహి యాత్ర మొదలైన తర్వాత జరిగిన తొలి బహిరంగ సభ అనంతరం.. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతున్నాయి. అత్యంత వేగంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అటు మీడియాలో కూడా స్వరాలు మారిపోతున్నాయి.. బ్రేకింగుల్లో అక్షరాలు తడబడుతున్నాయి. డిబేట్లలో కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి!

వారాహియాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ ప్రత్తిపాడు జిల్లాలోని కత్తిపూడిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలోనూ, అనంతరం జరిగిన పిఠాపురం సభలోనూ ఒక కీలక అంశం తెరపైకి తెచ్చారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థని బలంగా ప్రకటించారు. మరో అడుగు ముందుకేసి.. తనకు ముఖ్యమంత్రిగా ఒక ఛాన్స్ ఇవ్వండి.. రెండేళ్లు తన పాలన చూడండి.. నచ్చకపోతే రీకాల్ చేసెయ్యండి అని ప్రకటించారు. ఈ దేశంలో “రీకాల్” వ్యవస్థను పవన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

అయితే తాజాగా పవన్ ఇలా తనను తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకోవడం వెనక కీలక విషయమే దాగిఉందని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబుకు మాత్రమే తెలివి తేటలు సొంతం అనుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కారణం… రాష్ట్రంలో కాపు సామాజికవర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. పవన్ కు పదో పరకో సీట్లు ఇచ్చి… ఆ ఓటు బ్యాంకును సాంతం తనకు మలుచుకుని, ఫలితంగా అధికారంలోకి రావాలని చంద్రబాబు ఒక స్కెచ్ వేశారు!

అయితే మొదట్లో పవన్ ఈ విషయాన్ని గ్రహించారో.. లేక, గ్రహించినా మౌనంగా ఉన్నారో తెలియదు కానీ… ఇప్పుడు మాత్రం గ్రహించినట్లుగానే రియాక్ట్ అవుతున్నారు. తనకు తులమో ఫలమో సీట్లిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన జనసైనికుల ఓట్లు గంపగుత్తగా కొట్టేయాలని చూస్తున్నాడని గ్రహించినట్లున్నారు! ఫలితంగా తక్కువలో తక్కువ 40 – 50 సీట్లు తక్కువ కాకుండా ఇవ్వాలని ఇలా సీఎం పేరు చెప్పి బెదిరిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.

పవన్ మేధావి తనం అలా ఉంటే… పవన్ తాజా యూటర్న్ పై బాబు ఫీలవుతున్నారు. ఇందులో భాగంగా… త‌న‌తో పొత్తు లేక‌పోతే టీడీపీ అధికారంలోకి రాలేద‌ని, మ‌రోసారి జ‌గ‌నే సీఎం అవుతారంటూ బ్లాక్ మెయిల్ చేసి, ఎక్కువ సీట్లు రాబ‌ట్టుకునేందుకే ప‌వ‌న్ మైండ్ గేం కు తెర‌లేపార‌ని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తుంది. పైగా 40 – 50 సీట్లంటే చిన్నవిషయమా… టీడీపీ అభ్యర్థులను ఎలా ఒప్పించాలి అని బాబు తలపట్టుకున్నారని అంటున్నారు!

ఇదే సమయంలో… క్షేత్రస్థాయిలో క‌నీసం పార్టీ నిర్మాణం చేయ‌కుండా, గత ఎన్నికల్లో అధినేత అయ్యుండి ఒక్క సీటు కూడా గెలవకుండా… ఇప్పుడు త‌మ‌తో పొత్తు మాటున బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్నారని పవన్ పై బాబు ఫైరవుతున్నారని తెలుస్తుంది. ఇదే జరిగితే… భవిష్యత్తులో మొదటికే మోసం వచ్చి… టీడీపీ స్థానంలో జనసేన సెకండ్ ప్లేస్ లోకి వెళ్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారంట.

ఇలా ఒకరివల్ల ఒకరు ఎదుగుగున్నారనే ఆరోపణలతో ప్రస్తుతం పొత్తు ఆలోచలను పక్కకు పోయాయని ఒక చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా… పవన్ వ్యాఖ్యలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న చంద్రబాబు ఈ మేరకు తన బలం అయిన అనుకూల మీడియా పెద్దలతో చర్చించినట్లు సమాచారం. ఇందులో భాగంగా… “ఏకు మేకయ్యేలా ఉన్నాడు.. ప్రచారం తగ్గించండి” అని సూచించారని కథనాలొస్తున్నాయి!

అదే నిజమైతే… రేపటి నుంచి పవన్ కు ఆ వర్గం మీడియాలో కవరేజ్ ఇన్నర్ పేజీలకు, అది కూడా లెఫ్ట్ సైడ్ పేజీలకు పరిమితం అయిపోయినట్లే! ఇదే సమయంలో లైవ్ కవరేజ్ లో కూడా పరిమితి మరింత మితం అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. అదేవిధంగా చర్చా “గోష్టు”ల్లో కూడా ప్రశ్నల వెర్షన్ లు, సమాధానాల అర్ధాలు మారిపోవడం పక్కా! మరి ఈ విషయంలో పవన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది ఇప్పుడు కీలకంగా మారింది.

ఏది ఏమైనా… ఇద్దరు మేధావులు ఎంచుకున్న ఈ పొత్తు రాజకీయానికి ఆదిలోనే హంసపాదు ఎదురైందా.. లేక, కడుపులో కత్తులు పెట్టుకుని అయినా కలిసి ప్రయాణించే పనికి పూనుకుంటారా అనేది వేచి చూడాలి!