మూడో వేవ్ ముంచుకొచ్చేస్తోంది.. మీ చావు మీరు చావండి

వ్యాక్సిన్ వేసేసుకున్నాం.. అంతా మా ఇష్టం అనుకుంటున్నారా.? కరోనా ముందు ఈ కుప్పి గంతులు చెల్లవ్. సెకండ్ వేవ్ సమయంలో దేశ ప్రజల్ని కరోనాకి బలి పెట్టేశారు పాలకులు. రాష్ర్టాలదే బాధ్యతయ్యింది, లాక్డౌన్, కర్ఫ్యూలకు సంబంధించి. మూడో వేవ్ వస్తే, ఆ రాష్ర్టాలు కూడా చేతులెత్తేయాల్సిందే. మూడో వేవ్ భయాల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామనీ, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చెప్పడం పచ్చి బూటకం. ఆక్సిజన్ దొరక్క, రెండో వేవ్ సమయంలో దేశ వ్యాప్తంగా వేలాది మంది విగత జీవులు కాగా, అలా ఆక్సిజన్ దొరక్క ఎవరూ చనిపోలేదనీ, పార్లమెంట్ సమక్షంలో మోడీ సర్కారు చెప్పుకుంది.

అదొక్కటి చాలు.. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వాలకున్న చిత్తశుద్ధి ఎంతో. ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనా తీవ్రత తగ్గలేదు. తెలంగాణాలో తగ్గినట్లే తగ్గి, చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇది చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఆస్పత్రులు కరోనా పేషెంట్లతో నిండిపోతున్నాయని మీడియాలో కథనాలు చూస్తున్నాం. కానీ, ఎక్కడా జనం గుమిగూడడాన్ని ప్రభుత్వాలు నియంత్రించలేకపోతున్నాయి. మొదటి వేవ్ అత్యధికంగా రోజువారీ లక్ష లోపు కేసులు చవి చూస్తే, రెండోవేవ్ నాలుగు లక్షలు దాటేసింది. మూడో వేవ్ పది లక్షలు దాటుతుందనే అంచనాలున్నాయి. మరి, ప్రభుత్వాలు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. బాధ్యత లేని ప్రజలు. బాధ్యత లేని ప్రభుత్వాలు.. వెరసి మూడో వేవ్ వస్తోంది.. మీ చావు మీరు చావండి అని అనుకోవల్సింది. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా సోకిన కేసులు చాలానే ఉంటున్నాయి. ఆ వివరాలేవీ ప్రభుత్వాలు వెల్లడించడం లేదు.