తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సంగడి ముగిసింది. దీంతో ఇప్పుడు సర్వే సంస్థలన్నీ ఏపీకి షిప్ట్ అయ్యాయి! ఈ క్రమంలో ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ సత్తా చాటబోతుందనే విషయాలను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో స్వల్ప వ్యవధిలో మూడు సర్వేలు ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై ఫలితాలు వెల్లడించాయి. ఇందులో అటు వైసీపీకి, ఇటు టీడీపీ – జనసేన కూటములకూ గుడ్ న్యూస్ లు రావడం గమనార్హం.
అవును… ఏపీలో ఎన్నికల సందడి మొదలైపోయింది. ఇందులో భాగంగా ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. ఈ విషయంలో జగన్ అభ్యర్థుల ఎంపీకలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, చాలా నియోజకవర్గల్లో పెను మార్పులు చేస్తున్నారని అంటున్నారు. వాటికి సంబంధించిన కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు ఇప్పటికే సుమారు 60 మంది అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేశారని, సంక్రాంతికి అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు.
ఈ సమయంలో రాబోయే ఎన్నికల్లో గెలుపు తమరిదంటే తమరిదంటూ అధికార వైసీపీ, విపక్ష టీడీపీ – జనసేన కూటమి చెప్పుకుంటున్న వేళ… ఈసారి తమదే అధికారం అని కాంగ్రెస్, బీజేపీలు కూడా చెబుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలో మూడు సర్వే సంస్థలు వాటి వాటి ఫలితాలను విడుదల చేశాయి. వీటిలో ఏ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయన్నది ఇప్పుడు చూద్దాం.
ఇందులో కొన్ని రోజుల కిందట “జన్ మాట” అనే సర్వే సంస్థ ఏపీలో ప్రజానాడికి సంబంధించి ఒక రిపోర్టును విడుదల చేసింది. ఈ నివేధిక ప్రకారం… ఏపీలో రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీకి 116-120 స్థానాల్లో విజయం దక్కుతుందని స్పష్టం చేసింది. ఇక, టీడీపీ-జనసేన కూటమి 62-64 స్థానాల్లో గెలుస్తుందని తెలిపింది. ఇక ఇతరులకు 2-4 స్థానాల్లో విజయం దక్కించుకునే అవకాశం ఉందని వెల్లడించింది..
ఇక “రా” అనే సర్వే సంస్థ కూడా డిసెంబరు 2 వతేదీ నాటికి ఏపీలో ఉన్న పరిస్థితిపై సర్వే ఫలితాలను ప్రకటించింది. ఇందులో భాగంగా… వైసీపీకి 115-122 స్థానాలు, జనసేన-టీడీపీ కూటమికి 62-66 స్థానాలు దక్కుతాయని పేర్కొంది. ఇక ఇతరులకు 2-4 స్థానాల్లో విజయం దక్కుతుందని వెల్లడించింది. ఇలా ఈ రెండు సర్వేలూ ఏపీలో మరోసారి వైసీపీకే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని తెలిపాయి!
ఇదే సమయంలో “చాణక్య” అనే మరో సంస్థకూడా తాజాగా సర్వే ఫలితాలను వెల్లడించింది. ఇది మాత్రం టీడీపీ-జనసేన కూటమికి పట్టం కట్టింది. ఇందులో భాగంగా… టీడీపీ – జనసేన కూటమికి 125-135 స్థానాలు దక్కే అవకాశం ఉండగా… వైసీపీ కేవలం 43-52 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే ఉందని తెలిపింది. దీంతో… ఈ సర్వే ఫలితాలను టీడీపీ శ్రేణులు షేర్ చేస్తుండగా.. పై రెండు ఫలితాలను వైసీపీ శ్రేణులు నెట్టింట వైరల్ చేస్తున్నారు!