వైజాగ్ ని పరిపాలనా రాజధానిగా మారుస్తున్నామని వైసీపీ ప్రభుత్వం బయటకి హడావిడి చేస్తూ లోపల కుట్రలు, కబ్జాలు చేస్తుంది. ఇప్పటికే అనేక స్థలాలని తమ పేర్లు మీద మార్చేశారు వైసీపీ నేతలు. ఇప్పుడు వారి కన్ను వైజాగ్ ఫిల్మ్ క్లబ్‌పై పడ్డారు. క్లబ్‌ను స్వాధీనం చేసుకొని కార్యవర్గం మొత్తం వైసీపీ నాయకులు, ఓ సామాజిక వర్గం వారితో నింపేశారు. పాత వారిని బయటకు నెట్టేశారు.
రాష్ట్ర విభజన తరువాత చిత్ర పరిశ్రమ విశాఖలో స్థిరపడుతుందని భావించి ఇక్కడ ఆ రంగానికి చెందిన వారి కోసం ఒక క్లబ్ ఉంటే బాగుంటుందని నాటి మంత్రి గంటా శ్రీనివాసరావు, చిత్ర పరిశ్రమకు చెందిన కేఎస్ రామారావు, అశోక్‌కుమార్ తదితరులంతా కలిసి ‘వైజాగ్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం క్లబ్ నిర్వహణ కోసం తిమ్మాపురంలో 1.5 ఎకరాల స్థలం తీసుకొని అభివృద్ధి చేశారు. అద్దె, నిర్వహణ కోసం నెలకు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుండగా, ఆదాయం మాత్రం రూ.50 వేలకు మించి రావడం లేదు. లీజు కాలం మూడేళ్లు ముగిసిపోగా, మళ్లీ ఒప్పందం చేసుకున్నారు. కోర్ కమిటీకి కేఎస్ రామారావు చైర్మన్ కాగా, మరో 32 మంది సభ్యులు ఉండేవారు. కోర్ కమిటీలో ఎవరైనా సభ్యులు ఏదైనా కారణంతో చనిపోతే.. ఆ స్థానాన్ని వారి కుటుంబ సభ్యులు/వారసులతోనే భర్తీ చేయాలనే నిబంధన పెట్టారు.
ఇప్పుడు కొత్తగా కోర్ కమిటీలో చేరిన ఆ సామాజికవర్గం వారు ఎవరూ సభ్యత్వ రుసుము చెల్లించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇది నిబంధనలకు విరుద్ధం. ఈ కమిటీని సొసైటీల రిజిస్ట్రార్‌కు అందజేసి, ఆమోదించిన తరువాతే ప్రమాణ స్వీకారం జరగాలి. కానీ అలాంటిదేమీ లేకుండానే ఈ నెల 7న జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి, కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ఏర్పాట్లు చేశారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన వారితో కమిటీని నింపడం నిబంధనలకు విరుద్ధం. గతంలో క్లబ్‌కు భూసేకరణకు కృషిచేసిన వారిని విస్మరించారు.
కమిటీలో ఎవరినైనా నియమించాలంటే.. సభ్యులు ప్రతిపాదించాలనే నిబంధన పాటించలేదు. పార్టీలు మారినప్పుడల్లా కమిటీలను మార్చేస్తే చట్టం అంగీకరించదు. విశాఖపట్నంలో ఒక్కో సంస్థను శల్యపరీక్ష చేస్తున్న విజయసాయిరెడ్డి దృష్టిలో ఆరు నెలల క్రితం ఫిల్మ్ క్లబ్ పడింది. గత జనవరిలో కైవసం చేసుకున్నారు. పాత కోర్ కమిటీని రద్దు చేసి, 15 మందితో కోర్ కమిటీని వేసుకున్నారు. వైసీపీ నాయకులు ‘ప్రొటోకాల్ ప్రసాద్’గా పిలుచుకునే సాగి దుర్గాప్రసాద్‌రాజును అధ్యక్షునిగా నియమించటంతో అనాధికారకంగా క్లబ్ వైసీపీ హస్తగతమైంది. శ్రుతిమించిపోతున్న ఆక్రమాలతో హాదుమీరిన జగన్ ప్రభుత్వానికి విశాఖ ప్రజలు బుద్ది చెప్పటం తథ్యమని విశ్లేషకులు బావిస్తున్నారు.