పంచాయితీ ఎన్నికలలో టీడీపీ కుట్రపూరిత రాజకీయంతో నెగ్గుకు రావాలని చూస్తుంది. టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. వీరి వేధింపులు తార స్థాయికి చేరకముందే దౌర్జన్య కారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు అధికారులు వేడుకుంటున్నారు. ఎన్నికల అధికారులని కూడా కులం పేరుతో దూషిస్తూ వారిని మానసిక వేదనకు గురిచేస్తున్నారు. ప్రశాంత వాతావరణం మధ్య జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో గొడవలు రేపి ఎలాగైనా లబ్ధిపొందాలని ప్రణాళిక సిద్ధం చేసింది.
అందుకే తమ పార్టీ నేతలను గొడవలు చేసేవిధంగా ఉసిగొల్పుతోంది. ఉన్నతాధికారులు అని కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్నారు. నామినేషన్ కేంద్రాల్లో అలజడి సృష్టిస్తున్నారు. నామినేషన్ పత్రాలు తప్పులుతడకగా ఉన్నా తమ పార్టీ మద్దతుదారులవి ఆమోదించాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. మాట వినని అధికారులపై ఎదురుదాడికి దిగుతున్నారు. చిత్తూరు, గంగాధరనెల్లూరు, నగరి, చంద్రగిరి, పూతలపట్టు, సత్యవేడు నియోజకవర్గాల్లో మొదటి విడత పంచాయతీలు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యి పరిశీలన దశకు చేరింది.
అలాగే రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులోభాగంగా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలంలో తమ మద్దతుదారులకు నో డ్యూస్, ఇతర ధ్రువీకరణపత్రాలు ఇవ్వడం లేదని టీడీపీ నాయకులు శ్రీనాథ్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, రామచంద్ర తదితరులు మంగళవారం ఎంపీడీఓ వెంకటరత్నంను బెదిరించారు. గ్రామ సెక్రటరీలు టీడీపీ మద్దతుదారులకు సహకరించడం లేదని నానా మాటలు మాట్లాడారు. సహకరించకపోతే ఉద్యోగాలు ఊడుతాయ్ అంటూ హెచ్చరిక జారీచేశారు.
సుమారు గంటపాటు హంగామా చేశారు. దీనిపై ఎంపీడీఓ వెంకటరత్నం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా పాకాల తహసీల్దార్ లోకేశ్వరిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ముఖ్యఅనుచరుడు నాగరాజనాయుడు ఆదివారం దౌర్జన్యానికి దిగారు. అంతటితో ఆగక ఆమెను కులం పేరుతో దూషించారు. విజయపురం మండలం జగన్నాథపురం సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ మద్దతుతో నామినేషన్ దాఖలు చేశారు. అందులో భర్త పేరుకు బదులు తండ్రి పేరు రాసి ఉండడంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది.
కోసలనగరం సర్పంచ్ అభ్యర్థికి 1.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. నామినేషన్ పత్రంలో ఆ భూమి ఉన్నట్లు చూపించ లేదు. నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. గత ఆదివారం యాదమరి మండలంలో ఎమ్మెల్సీ దొరబాబు రెచ్చిపోయారు. తనకారుతో వేగంగా వచ్చి రోడ్డుపక్కన వెళ్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దూసుకెళ్లారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయా ఘటనలను ఆ పార్టీ నేతలే వీడియోలు తీసి పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపడం.. అక్కడి నుంచి కొన్ని చానళ్లకు వెళ్లడం జరిగిపోతోంది. అందులో టీడీపీ నేతల మాటలు, దాడులను ఎడిట్ చేసి జనం నమ్మేలా చూయిస్తున్నారు. ప్రజలే ఇలాంటి వారికి సరైన గుణపాఠం చెప్తారు.