వైఎస్ వివేకా ‘లేఖ’ వెనుక.!

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి రాసినట్లుగా చెప్పబడుతున్న లేఖపై రచ్చ జరుగుతోంది. ఆ లేఖ ఆధారంగా విచారణ ఎందుకు జరగడంలేదన్నది తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్న.

హత్య జరిగిన సమయంలో కొస ప్రాణంతో వున్నప్పుడు వివేకానంద రెడ్డి ఆ లేఖ రాశారనే ప్రచారం తొలుత జరిగింది. కానీ, ఆ తర్వాత ఆ లేఖ తామే రాయించామని నిందితుల్లో ఒకడైన దస్తగిరి (అప్రూవర్‌గా మారి) చెబుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

వివేకా హత్యను తీవ్రంగా ఖండించిన అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకానొక సమయంలో, ‘హత్య జరుగుతున్నప్పుడు ఎవరైనా లేఖ రాయగలరా.?’ అని ప్రశ్నించారు. అది సృష్టించబడిన లేఖ.. కేసుని తప్పుదోవ పట్టించేందుకు రాయించబడిన లేఖ.. అని వైఎస్ జగన్ ఆరోపించారు.

సో, అసలు ఆ లేఖ ప్రస్తావన ఈ కేసులో ఇప్పుడు అనవసరం. కానీ, వైసీపీకే చెందిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి, గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పు పట్టిన ఆ లేఖను ఆధారంగా చేసుకుని సీబీఐ తన విచారణ కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

వైఎస్ వివేకా మంచోడు, సౌమ్యుడన్నారు.. అది గతం.! వైఎస్ వివేకా సెటిల్మెంట్లు చేశారు. ఆయనకు పలువురు మహిళలతో అక్రమ సంబంధాలున్నాయంటున్నారు.. ఇది ప్రస్తుతం.! వైసీపీ నుంచే భిన్నమైన వాదనలు వస్తుండడం ఈ కేసు తీవ్రతను మరింత పెంచుతోందనడం నిస్సందేహం.