విజయసాయిరెడ్డి ట్వీట్ల ఆంతర్యమేంటి.?

కొన్నాళ్ళుగా స్తబ్దుగా వున్న వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మళ్ళీ ట్విట్టర్‌లో యాక్టివ్ అయ్యారు. ఎందుకలా.? టీడీపీ మీద సెటైర్లేయడంలో దిట్ట అయిన విజయసాయిరెడ్డి అనూహ్యంగా ఎందుకు సైలెంటయ్యారు.? మళ్ళీ మునుపటి ఉత్సాహంతో ఇప్పుడెందుకు ట్వీట్లేస్తున్నారు.?

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. మామూలుగా అయితే, వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరగాలి. కానీ, ఈ ఏడాదే ఎన్నికలన్నట్లుగా రాజకీయ హంగామా కనిపిస్తోంది. అధికార వైసీపీ, పలు కార్యక్రమాలతో జనంలోకి వెళుతోంది.

అయినాగానీ, విజయసాయిరెడ్డి నిన్న మొన్నటిదాకా సైలెంటుగానే వున్నారు. బీజేపీ వైపు విజయసాయిరెడ్డి అడుగులేస్తున్నారనీ, టీడీపీతో ఆయన టచ్‌లోకి వెళ్ళారనీ.. ఇలా రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అధినేత వైఎస్ జగన్, విజయసాయిరెడ్డికి ‘పార్టీలో యాక్టివ్ అవ్వాలి’ అని ఆదేశించినట్లు తెలుస్తోంది.

అదొక్కటే కాదు, వచ్చే ఎన్నికల్లో విజయసాయిరెడ్డి లోక్ సభకు పోటీ చేసే ఆలోచనలో కూడా వున్నారన్నది తాజా ఖబర్. విశాఖ నుంచే ఆయన పోటీ చేస్తారా.? అంటే, అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.

పార్టీలో తానూ యాక్టివ్‌గానే వున్నానని నిరూపించుకోవడం విజయసాయిరెడ్డి ముందున్న తక్షణ కర్తవ్యం. ఈ క్రమంలోనే ఆయన యాక్టివ్ అయ్యారు. అదే సమయంలో, వైసీపీలో కొన్ని ముఖ్యమైన బాద్యతలు కూడా ఈ మధ్య విజయసాయిరెడ్డికి బదలాయింపు చేయబడ్డాయట. అలా విజయసాయిరెడ్డికి బదలాయించబడ్డ బాధ్యతలు గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకునేవారని తెలుస్తోంది.