జనసేన అధినేత మౌనం వెనుక కారణం ఇదేనా.?

అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ తెరపైనుంచి కనుమరుగయ్యారు. షూటింగ్ గ్యాప్‌లో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడంలేదు. వారంలో ఒక్కసారన్నా నేరుగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపించేవారు. ఇప్పుడా పరిస్థితి ఎందుకు లేదు.?

వారాహి వాహనం ఏమయ్యిందో తెలియదు.! పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటారో తెలియదు. పొత్తుల వ్యవహారానికి సంబంధించి స్పష్టత లేదు. కానీ, జనసేన శ్రేణులకు దిశా నిర్దేశం జరుగుతూనే వుందట.

ఇంతకీ, నాగబాబు పరిస్థితేంటి.? జనసేన ప్రధాన కార్యదర్శి అయ్యారు ఇటీవలే నాగబాబు. కానీ, ఆయనా అంత యాక్టివ్‌గా కనిపించడంలేదు. దాంతో, జనసేన శ్రేణుల్లో కొంత గందరగోళం కనిపిస్తోందన్న ప్రచారమైతే జరుగుతోంది.

‘ఛాన్సే లేదు.. అధినేత దిశానిర్దేశం మేరకే మేం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం..’ అంటోంది జనసేన. న్యూస్ ఛానళ్ళ చర్చా కార్యక్రమంలో చాలా యాక్టివ్ అయ్యారు జనసేన నేతలు. వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో అయినా, మరో విషయంలో అయినా, జనసేన నాయకులు సమర్థవంతమైన వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

జనసేనాని తెరపైకొస్తే.. మళ్ళీ ప్యాకేజీ రచ్చ జరుగుతుంది. ఇప్పటికైతే.. సినిమాల్లో ఆయన బిజీగా వున్నారు. అదే సమయంలో, అధికార వైసీపీ.. రకరకాల సమస్యలతో సతమతమవుతోంది. ఈ సమయంలో జనసేనాని వ్యూహాత్మకమౌనం, వైసీపీతోపాటు, టీడీపీకి సైతం కొంత అయోమయం కలిగిస్తోంది.