మారుతోన్న విశాఖ ముఖ చిత్రం.!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం నగరానికి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో హైద్రాబాద్ తర్వాత ఆ స్థాయి నగరం విశాఖపట్నం మాత్రమే.! ఆ ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, రాజధాని అవకాశం విశాఖకే రావాల్సి వున్నా, చంద్రబాబు హయాంలో విశాఖని కాదని, అమరావతిని రాజధానిగా చేసిన సంగతి తెలిసిందే.

వైఎస్ జగన్ హయాంలో, విశాఖపట్నం నగరానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ హోదా తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనా, అవి ముందుకు కదలడంలేదు. మూడు రాజధానుల అంశం, న్యాయ వివాదాల కారణంగా వెనక్కి వెళ్ళింది. అదెప్పుడు మళ్ళీ ముందుకు వెళుతుందో తెలియదు.

అయితే, గడచిన నాలుగేళ్ళలో విశాఖ రూపు రేఖలు చాలానే మారాయి. అవి సహజంగానే వచ్చిన మార్పులయినాగానీ, వైసీపీ సర్కారు పెట్టిన ప్రత్యేక శ్రద్ధనీ కాదనలేం. తాజాగా, విశాఖలో ఇనార్బిట్ మాల్‌కి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. భారతదేశంలోనే ఇది అతి పెద్ద షాపింగ్ మాల్ కాబోతోందిట.

ఓ ప్రైవేటు షాపింగ్ మాల్ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి వెళ్ళడమేంటి.? అన్న విమర్శలు రావడం సహజమే. అది మళ్ళీ వేరే చర్చ. కానీ, విశాఖ నడిబొడ్డున అతి పెద్ద షాపింగ్ మాల్.. అంటే చిన్న విషయం కాదు. ప్రత్యక్షంగా పరోక్షంగా బోల్డన్ని ఉపాధి అవకాశాలు వస్తాయ్ ఈ మాల్ ద్వారా.

సముద్ర తీరాన్ని అభివృద్ధి చేస్తుండడం, నగర సుందరీకరణలో భాగంగా పలు చర్యలు చేపడుతుండడం.. వీటి కారణంగా, విశాఖకు అనధికారికంగానే రాజధాని హోదా వచ్చేస్తోంది.