Marriage age for women: మహిళల కనీస వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం, పురుషుల వివాహ కనీస వయస్సు 21 అయితే, మహిళలకు ఇది 18 సంవత్సరాలు. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ ప్రణాళిక సమీక్షలో ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. పోషకాహార లోపం, ఆరోగ్య సమస్యల నుండి బాలికలను కాపాడుకోవాలని, సరైన వయస్సులో వివాహం చేయడం అవసరమని తమ ప్రభుత్వం సోదరీమణుల గురించి నిరంతరం శ్రద్ధ వహిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహాల చట్టం, హిందూ వివాహాల చట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు గతేడాది జూన్ నెలలో నీతి ఆయోగ్ టాస్క్ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. జయ జైట్లీ నేతృత్వంలోని కమిటీలో ప్రభుత్వ నిపుణుడు వీకే పాల్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు.
నీతి ఆయోగ్ టాస్క్ఫోర్స్ దేశవ్యాప్తంగా అనేక యూనివర్సిటీల, NGO ల, ప్రత్యేక ప్రాంతాల ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించి కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచింది. మొదటి గర్భధారణ సమయంలో స్త్రీకి కనీసం 21 ఏళ్లు ఉండాలని, వివాహాలలో ఆలస్యం వలన కుటుంబాలు, సమాజం మరియు పిల్లలపై సానుకూల ఆర్థిక, సామాజిక మరియు ఆరోగ్య ప్రభావాన్ని చూపుతుందని టాస్క్ఫోర్స్ సూచించింది.