దువ్వాడ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్ లో ఇరుక్కుపోయిన యువతి మరణం..!

కొన్ని సందర్భాలలో అనుకోకుండా జరిగే ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. తాజాగా ఇటువంటి దారుణ సంఘటన విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. శశికళ అనే యవతి రైలు దిగుతూ పొరపాటున కాలుజారి రైలు కి ప్లాట్ఫామ్ కి మధ్యలో ఉన్న ప్రదేశంలో ఇరుక్కుపోయింది. కొన్ని గంటల పాటు బయటికి రాలేక నరకయాతన అనుభవించింది. రైల్వే సిబ్బంది దాదాపు గంట సమయం పాటు శ్రమించి ప్లాట్ఫారం తొలగించి శశికళని ప్రాణాలతో బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

వివరాలలోకి వెళితే…అన్నవరానికి చెందిన శశికళ అనే యువతి దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతి రోజులాగే కాలేజ్ కి వెళ్ళటానికి గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి దువ్వాడ చేరుకుంది. అయితే రైలు ఇంకా రన్నింగ్‌లో ఉండగానే రైలు నుండి దిగటానికి ప్రయత్నం చేసింది. ఈ సమయంలో ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫామ్ కిందికి జారిపోయింది. ఈ క్రమంలో ప్లాట్‌ఫామ్-రైలు మధ్య ఇరుక్కుపోయి గంట సమయం పాటు నరకయాతన అనుభవించింది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి ఆ యువతిని రక్షించడానికి ప్లాట్ఫామ్ బద్దలు కొట్టారు.

ఆ తర్వాత యువతిని బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే రైలుకి ప్లాట్ ఫామ్ కి మధ్య ఇరుక్కుపోయి ఆమె నడుము భాగంలో ఉన్న అవయవాలు తీవ్రంగా గాయపడటం వల్ల అంతర్గత రక్తస్రావం జరిగిందని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఇలా చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు కోల్పోయింది. కాలేజీకి వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుండి బయలుదేరిన కూతురు ఇలా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో శశికళ తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీరుగా వెలిపిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.