ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ కి సంబంధించి రైతుల భూముల విషయంలో గత 15 సంవత్సరాలుగా నెలకొన్న సమస్యలను సీఎం వైఎస్ జగన్ పరిష్కరించారు. కాకినాడ సెజ్ కు భూములు ఇచ్చి పరిహారం తీసుకోని వారికి భూమి వాపసు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు కాకినాడ రైతులకు 2,180 ఎకరాలు తిరిగిచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది.
నాడు ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర సమయంలో రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. కాకినాడ సెజ్ కోసం గత సర్కారు హయాంలో రైతుల నుంచి బలవంతంగా 2,180 ఎకరాలు తీసుకోవడం తెలిసిందే. దీంతో రైతులు పరిహారం తీసుకునేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో సెజ్ కోసం రైతుల నుంచి తీసుకున్న భూములని తిరిగి వారికే ఇవ్వాలని దీనిపై ఏర్పాటైన కమిటీ చేసిన సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. స్థానిక ప్రజల మనోభావాలను గౌరవించడంలో భాగంగా ఆరు గ్రామాలను తరలించరాదని కమిటీ చేసిన సిఫార్సుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కాకినాడ సెజ్‌లో రైతుల సమస్య పరిష్కారానికి మంత్రి కన్నబాబు నేతృత్వంలో కమిటీని సీఎం జగన్ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ కమిటీ రైతులతో పాటు కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట సమితితో సంప్రదింపులు జరిపి ఆమోదయోగ్యమైన, అన్నదాతలకు మేలు జరిగేలా సిఫార్సులను చేసింది. సీఎం జగన్ అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో సిఫార్సులతో కూడిన కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది. ఈ భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తున్నందున కే – సెజ్ కోసం జమ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కమిటీ చేసిన సిఫార్సును కేబినెట్ ఆమోదించింది.