వైఎస్ జగన్ ఆందోళన చెందుతున్నది అందుకే.!

బీజేపీ, జనసేనతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలం పుంజుకుందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ సర్వేల్లో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, సర్వేల ఫలితాల్ని బట్టి, తెలుగుదేశం పార్టీ ఇంకా బలంగానే వుందన్నది రాజకీయ పరిశీలకుల భావన.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. అన్న కోణంలో జరుగుతున్న చాలా సర్వేలు వైసీపీకి 18 లోక్ సభ సీట్లను కట్టబెడుతోంటే, టీడీపీకి 7 లోక్ సభ సీట్లను కట్టబెడుతున్నాయి. ప్రస్తుతం మూడు లోక్ సభ సీట్లు మాత్రమే వున్న టీడీపీ, రెండింతలు బలపడబోతోందన్నమాట.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. అదీ సంఖ్యా బలం పరంగా.

ఏడు లోక్ సభ సీట్లు అంటే, ఆ లెక్కన సుమారు 60 వరకు టీడీపీకి అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం వుందనే కదా అర్థం.? అదే, ఆ ఈక్వేషన్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కొంత ఆందోళనకు గురిచేస్తోంది. ‘మన టార్గెట్ 175..’ అని వైఎస్ జగన్ పదే పదే చెబుతున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.

కానీ, కింది స్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి. ఒకవేళ టీడీపీకి బీజేపీ, జనసేన తోడైతే.. ఖచ్చితంగా ఈక్వేషన్‌లో పెను మార్పు సంభవిస్తుంది. ఆ ఈక్వేషన్ ఫలించి, వైసీపీ అధికారం కోల్పోతే.? ఈసారి వైసీపీని రాత్రికి రాత్రి నిర్వీర్యం చేసేస్తారు టీడీపీ అధినేత చంద్రబాబు.

2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక, టీడీపీని పూర్తిగా ఖాళీ చేయలేకపోయింది. కానీ, టీడీపీ అలా కాదు.. అధికారంలోకి వస్తే, ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తుంది. ఆ సంగతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే దుష్ట చతుష్టయం, దత్త పుత్రుడు.. అంటూ వైఎస్ జగన్ జనం వద్ద మొర పెట్టుకుంటున్నారు.
అయితే, ఈ లెక్కలు ఇలాగే వుంటాయని అనుకోవడానికి వీల్లేదు. రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ అంటే ఒక్కోసారి రెండు అవ్వొచ్చు.. ఒక్కోసారి సున్నా కూడా అవ్వొచ్చు.