అతివిశ్వాసం – ఆత్మవిశ్వాసం మధ్యలో జగన్!

తాజాగా ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకు ఉన్న బలం రీత్యా 6 సీట్లు – టీడీపీకున్న సంఖ్య రీత్యా 1 సీటు దక్కింది. టీడీపీ లోని నలుగురు ఎమ్మెల్యేలు సైకిల్ దిగిపోకపోయినా… ఇద్దరు డైరెక్టుగా – మరొకిద్దరు ఇన్ డైరెక్టుగా జగన్ కు వెన్నుపోటు పొడవకపోయినా ఇదే రిజల్ట్స్ వచ్చేవి. ఎందుకంటే… అధికారికంగా జగన్ బలం 151 కాగా, చంద్రబాబు బలం 23. అయినా కూడా జగన్ అత్యాశకు పోయారు. ఫలితంఆ బంగపడ్డారు. ఇప్పుడు ఇదే బాబు బలమై కూర్చుంది.

2019 ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో అదే తీర్పుకు కట్టుబడి పార్టీలు ఉంటే.. నేతలు నిఖార్సుగా నిలబడి ఉంటే.. ఈ ఎన్నికలు – వాటి ఫలితాలు అనేవి అస్సలు లెక్కల్లోకి వచ్చేవి కాదు. ప్రజలెవరూ ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుని ఉండేవారు కాదు. ఫలితాలను పట్టించుకునేవారు కాదు. నాయకులకు నాయకులకూ మధ్య ఈ యవ్వారం సైలంటుగా సాగిపోయేది. అయితే… ఈ ఎన్నికలకు మసాలా అద్దింది మాత్రం వైకాపానే!

కానీ… బాబు వ్యూహాల ముందు – పక్కపార్టీ నేతలకు ఆకర్షించే విషయంలో ఆయనకున్న అనుభవం ముందు… జగన్ నమ్మకం ఓడిపోయింది. ఫలితంగా… ఏపీలో ఇంతకాలం అంపశయ్యపై ఉన్న టీడీపీ, లేచి నడిచేస్తుందని, రేపో మాపో పరిగెట్టేస్తుందని.. రాబోయే ఎన్నికల్లో బంగారు పథకం సాధిస్తుందనే కథనాలకు ఛాన్స్ వచ్చింది. అది కాస్తా… జనాల్లో జగన్ గ్రాఫ్ పడిపోతుందని – జగన్ పై జనాల్లో నమ్మకం సన్నగిల్లుతుందనే కథనాలు రావడానికి ఆస్కారంగా మారింది.

దీంతో… జగన్ కి బాబు చాలానే నేర్పించారని అంటున్నారు విశ్లేషకులు. రాజకీయాల్లో ఆశ, ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమో.. అత్యాశ, అతివిశ్వాసం అంత ప్రమాధం అని స్పష్టం చేస్తున్నారు! మరి రాబోయే రోజుల్లో అయినా జగన్ ఇవి నేర్చుకుంటారా? లేక, తన అత్యాశతో, అతివిశ్వాసంతో బాబుకు బూస్ట్ ఇస్తారా అన్నది వేచి చూడాలి!