గాంధీ భవన్ వద్ద ఓ వర్గం ఆందోళన, టెన్షన్ టెన్షన్ (వీడియోలు)

గాందీ భవన్ వద్ద యాదవులు ఆందోళనకు దిగారు. బిసి జనాభాలో అధిక శాతం ఉన్న యాదవులకు కేవలం ఒక్క సీటు కేటాయించడం పై యాదవ సంఘాల నాయకులు గాంధీ భవన్ ముందు ధర్నా చేపట్టారు. యాదవులకు కనీసం 5 సీట్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా యాదవులకు సీట్లు కేటాయించాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని వారు హెచ్చరించారు.

మహాకూటమి ఏర్పాటు వల్ల అనేక సీట్లు కోల్పోయామని యాదవ నేతలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడు క్యామ మల్లేష్ 3 కోట్లకు టికెట్లు అమ్ముకున్నారంటూ ఆరోపణలు చేశారు. భిక్షపతి యాదవ్ అనుచరులు గాంధీ భవన్ ముందు ఆందోళన నిర్వహించారు. యాదవ సామాజిక వర్గానికి టికెట్లివ్వాలని డిమాండ్ చేసినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

ముషీరాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ కు మాత్రమే టికెట్ కేటాయించారని ఇది యాదవులను అవమాన పరచడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదవులు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో శ్రమించారన్నారు. పార్టీ కోసం స్వంత ఆస్తులు అమ్ముకొని క్యాడర్ ను కాపాడుకుంటూ వచ్చామన్నారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టకుండా పార్టీ కోసం పని చేశామని అలా చేస్తే దక్కే గౌరవం ఇదేనా అని వారు ప్రశ్నించారు.

చాలా మంది కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నా కూడా తమ వ్యక్తిగత జీవితాన్ని ఆగం చేసుకొని పార్టీ కోసం పని చేశారన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా ఎవరికో టికెట్లు ఎలా ఇస్తారని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ అసలు విషయం తెలుసుకొని యాదవులకు 5 సీట్లు కేటాయించాలన్నారు. ఆందోళన చేసిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి. 

 

 

యాదవ సంఘాల ఆందోళనతో గాంధీ భవన్ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. గాంధీ భవన్ లో టైట్ సెక్యూరిటి ఏర్పాటు చేసి అనుమతి ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో యాదవ సంఘ నేతలు గేట్లు ఎక్కి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకొని కిందకు దించారు. కొంత మందిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.