చంద్రబాబు బీసీల కోసం పోరాడుతున్నట్టు బీసీలకు కూడ తెలియలేదే !

TDP leaders raising BC issue

గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుగారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ఘోర వైఫల్యం చెందింది. పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోయారు. 151 మంది ఎమ్మెల్యేలను గెలిచిన వైసీపీకి, 23మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకున్న టీడీపీకి నడుమ 10 నుండి 11 శాతం మధ్యలోనే. అంతమాత్రానికే టీడీపీ తలరాత పూర్తిగా మారిపోయింది. పార్టీ పాతాళానికి పడిపోయింది. ఈ తేడాకు కారణం బీసీ ఓటర్లే. తెలుగుదేశం మనుగడ మొదట నుండి బీసీ ఓటర్ల మీద ఆధారపడే సాగుతూ వస్తోంది. టీడీపీ అంటే బీసీల పార్టీ అనే ముద్ర ఉండేది. ఇన్ని దశాబ్దాల్లో ఏనాడూ బీసీలు తెలుగుదేశానికి మొండి చేయి చూపలేదు. కాస్త అటు ఇటుగా సంపూర్ణ మద్దతు పచ్చ జెండాకే ఇచ్చేవారు. అలాంటిది 2019 ఎన్నికల్లో మాత్రం ఘలక్ ఇచ్చారు. 30 శాతానికిపైగా బీసీ ఓటర్లు వైసీపీకి మద్దతు పలికి ఉంటారనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.

వైసీపీ కూడ తమ వైపు చూసిన బీసీలను అస్సలు వదులుకోకూడదని బీసీల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయని రీతిలో బీసీ కార్పొరేషన్లను నెలకొల్పింది. బీసీలకు చైర్మన్, డైరెక్టర్ల పేరుతో పెద్ద ఎత్తున పదవులు కల్పించింది. బీసీల సంక్షేమానికి వేల కోట్లు కేటాయిస్తున్నట్టు లెక్కలు చెబుతోంది. దీన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. వైసీపీ బీసీలను మోసం చేస్తోందని ఆరోపిస్తోంది. నిజానికి వైసీపీలో కీలక పదవుల్లో రెడ్డి నేతలే ఉన్నారు. ఇక్కడ కీలకం అంటే నిర్ణయాలు తీసుకోవడంలో, పాలన సాగించడం లాంటి పోస్టులన్నమాట. వైసీపీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది పూర్తిగా జగన్ సామాజికవర్గానికి చెందినవారే. అందులో ఎలాంటి అనుమానం లేదు. జగన్ చుట్టూ ఉన్న కోటరీని చూస్తే అది స్పష్టమవుతుంది.

TDP leaders raising BC issue
TDP leaders raising BC issue

అంతేకాదు యూనివర్సిటీల వీసీ పదవుల్లో బీసీలకు పెద్దగా చోటు లేదు. టీటీడీ ఛైర్మన్ పదవిలో, ఆ పాలమండలిలో రెడ్డి వర్గమే ఎక్కువ. నామినేటెడ్ పదవులు, కేబినెట్ ర్యాంక్ స్థాయి కలిగిన పదవులు రెడ్డి నేతల చేతుల్లోనే ఉన్నాయి. ఇదంతా నిజమే కానీ చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు సహా టీడీపీ లీడర్లంతా బీసీలను ఉద్ధరించింది తామేనని చెప్పుకోవడమే విడ్డూరంగా ఉంది. ఈనాడు వైసీపీ బీసీ కార్పొరేషన్ పదవులను ఎలాగైతే బీసీలకు ఇచ్చిందో ఆనాడు టీడీపీ కొన్ని కీలకమైన నామినేటెడ్ పదవుల్లో బీసీలను కోర్చోబెట్టింది. అయితే వారంతా డమ్మీలుగానే ఉండిపోయారు. బీసీల కంటే ఎక్కువగా బాబుగారు సొంత సామాజికవర్గాన్ని ప్రోత్సహించుకున్నారు. కీలకమైన చాలా పోస్టులు వారికే కట్టబెట్టారు. ప్రభుత్వంలో, పార్టీలో వారిదే హవా. అప్పట్లో కొందరు బీసీ లీడర్లే బాబు సామాజికవర్గం యొక్క డామినేషన్ ఎక్కువైందని మండిపడ్డారంటే వాతావరణం ఎంత ‘కమ్మ’గా ఉండేదో ఊహించవచ్చు.

ఇదంతా గమనించే బీసీలు కొందరు దశాబ్దాల అనుబంధాన్ని పక్కనపెట్టి టీడీపీని కాదని వైసీపీకి ఓటేశారు. ఒకవేళ అచ్చెన్నాయుడు చెబుతున్నట్టు బీసీలకే గనుక ఆనాడు టీడీపీలో న్యాయం జరిగి ఉంటే ఈరోజు టీడీపీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది కాదు. ఇన్ని సాక్ష్యాలు కళ్ళ ముందు ఉన్నప్పటికీ వారు బీసీలను అభివృద్ధి చేసింది మేమే, వారి కోసం పోరాడింది, పోరాడుతున్నది, పోరాడబోయేది చంద్రబాబే అనడం చూస్తే చంద్రబాబు మూలంగా బీసీలకు జరవుతున్న మంచిని బీసీలే గుర్తుపట్టట్లేదని మాట్లాడుతున్నట్టు ఉంది.