అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి కేంద్రంగా తాడిప్రతిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాడిపత్రిలో మండలంలోని చిన్నపొలమడలో ఉన్న ప్రబోధానంద స్వామి ‘ శ్రీకృష్ణాశ్రమం స కు వ్యతిరేకంగా జేసి ఈ రోజు ఉదయం నుండి పోలీస్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారు. స్వయంగా ఎంపినే రోడ్డుపై ధర్నాకు దిగటంతో మద్దతుదారులు భారీ ఎత్తున చేరుకోవటంతో ఉద్రిక్తత మొదలైంది. అంటే ఒకవైపు జేసి మద్దతుదారులు, ఇంకోవైపు ఆశ్రమ నిర్వాహకుల తరపున భక్తులు మోహరించారు. దాంతో ఎవరికి సర్దిచెప్పాలో అర్ధంకాక పోలీసులు అవస్తలు పడుతున్నారు.
దాదాపు ఏడాది క్రితం ఆశ్రమ నిర్వాహకులకు చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్ ను తాడిపత్రి ఎంఎల్ఏ జేసి ప్రభాకర్ రెడ్డి కొట్టినందుకు ఎంఎల్ఏపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. తనపైనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించారన్న కోపం జేసి ప్రభాకర్ రెడ్డిలో ఆశ్రమ నిర్వాహకులపై కసిని రగిల్చింది. ఆశ్రమంలో నిర్మాణాలకు ఇసుకను తరలిస్తుండగా ఎంఎల్ఏ తన అనుచరులతో 2017లో ట్రాక్టర్లను అడ్డుకున్నారు. అడ్డుకోవటమే కాకుండా ట్రాక్టర్ డ్రైవర్ ను కొట్టారు. దాంతో అప్పటి నుండి ఇరువర్గాలకు గొడవలు మొదలయ్యాయి. చిన్నదో పెద్దదో ఏదో ఒక సందర్భాన్ని అడ్డుపెట్టుకుని జేసి సోదరులు ఆశ్రమ నిర్వాహకులపై గొడవలకు దిగుతూనే ఉన్నారు. వినాయకచవితి ఊరేగింపు సందర్భంగా మొదలైన గొడవ కూడా అందులో భాగమే.
నిజానికి జిల్లా మొత్తం జేసిల నోటికి దడుసుకుంటారు. అయితే వారిపై లోపల ఎంత కోపమున్నా నేరుగా మాత్రం ఢీకొనే శక్తి లేదుకాబట్టే బయటపడటం లేదు. అటువంటి ఆశ్రమ నిర్వాహకులు అందులోను తాడిపత్రిలో వాస్తవ్యులే తమను బహిరంగంగా సవాలు చేయటాన్ని జేసి సోదరులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే ఈ అవకాశాన్ని ఎంపి ప్రతిష్టగా తీసుకుని పోలీస్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ఆశ్రమ నిర్వాహకులను అరెస్టు చేసేంత వరకు వెనక్కు తగ్గేది లేదంటూ సవాలు చేస్తున్నారు. అందుకనే తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు ఈ గొడవ ఎంతదాకా వెళుతుందో ఎవరికీ అర్ధం కావటం లేదు.