జగన్ హమీలతో చంద్రబాబులో టెన్షన్ ..అధికారానికి పనికిరాడట

ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబునాయుడు విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు సోషియాలజీ, ఎకనామిక్స్ తెలీదు కాబట్టి అధికారం అప్పగిస్తే చాలా ప్రమాదమట. జగన్ కు పంచాయితీ బోర్డుకున్న అనుభవం కూడా లేదని చంద్రబాబు ఎద్దేవా చేయటం విడ్డూరంగా ఉంది. సోషియాలజీ, ఎకనామిక్స్ తెలీకపోవటం వల్లే అన్నీ ఇచ్చేస్తామని కబుర్లు చెబుతున్నట్లు మండిపడ్డారు. కాబట్టి జగన్ అధికారం అందుకోవటానికి పనికిరాడన్నట్లు చెప్పారు.

 

ఇక్కడే చంద్రబాబు ఒక విషయం మరచిపోయినట్లున్నారు. జగన్ రెండు సార్లు ఎంపిగా ఒకసారి ఎంఎల్ఏగా గెలిచారు. చంద్రబాబు చెప్పినట్లుగా జగన్ కు సోషియాలజీ, ఎకనామిక్స్ తెలీక పోవచ్చు. కానీ ఎన్నికల్లో గెలవటానికి జనంనాడి తెలిస్తే చాలు కదా ? మూడుసార్లు ప్రజాప్రతినిధిగా గెలిచిన వ్యక్తికి పంచాయితీ బోర్డు మెంబర్ కున్న అనుభవం కూడా లేదని చంద్రబాబు ఎలా చెప్పారో అర్ధం కావటం లేదు. అసలు ఎన్నికల్లో ఏనాడు ఓటు కూడా వేయలేదని స్వయంగా చెప్పిన ఎన్టీయార్ తెలుగుదేశంపార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి రాలేదా ?

 

ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మునుసబు, కరణీకాలను రద్దు చేసి వాటి స్ధానంలో మండల వ్యవస్ధ తీసుకొచ్చింది ఎన్టీయార్ కాదా ? మండల వ్యవస్ధ ఏర్పాటు స్ధానిక సంస్ధల్లో పెద్ద సంచలనంగా మారింది అప్పట్లో. మరి ఎన్టీయార్ కు పాలనలో అనుభవం ఏముందని మండల వ్యవస్ధను తీసుకొచ్చారు? అధికారంలోకి వచ్చే వాళ్ళకు పాలనానుభవం లేకపోతే మాత్రం నష్టమేంటి ? ఐఏఎస్ అధికారులున్నది దేనికి ? పాలకులకు మంచి సలహాలనిచ్చి ప్రభుత్వాన్ని సక్రమంగా నడించేందుకే కదా ? అంతెందుకు చంద్రబాబు ఎంఎల్ఏగా గెలిచేనాటికి ఉన్న అనుభవం ఏంటి ? మంత్రి ఎలా అయ్యారు ? ముఖ్యమంత్రయ్యేనాటికి చంద్రబాబుకున్న పాలనానుభవం ఏంటి ? ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచేంత అనుభవం ఉండబట్టే కదా సిఎం అయ్యింది ?

 

దొడ్డిదోవన మంత్రి అయిన పుత్రరత్నం నారా లోకేష్ కున్న అనుభవం ఏపాటిది ? లోకేష్ ప్రజాక్షేత్రంలో గెలిచే మంత్రయ్యారా ? ఎంఎల్ఏగా గెలవటం అనుమానమనే కదా దొడ్డిదోవన ఎంఎల్సీని చేసి మంత్రిని చేసింది ? లోకేష్ కన్నా జగనే నయం కదా మూడుసార్లు ప్రజాక్షేత్రంలో తన సత్తా ఏంటో చాటారు. ఇక సోషియాలజీ, ఎకనామిక్స్ తెలీకపోతే వచ్చే నష్టమేంటో అర్ధం కావటం లేదు. పోయిన ఎన్నికల్లో తానిచ్చిన ఉచిత హామీలను చూసేకదా జనాలు మోసపోయి చంద్రబాబుకు ఓటేసింది. పోయిన ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత హామీల్లో ఒక్కటైనా సక్రమంగా చంద్రబాబు అమలు చేశారా ? హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత జనాలను మోసం చేయటానికి ఎకనామిక్స్, సోషియాలజీ చదివితే ఎంత ? చదవకోపోతే ఎంత ? జగన్ ఇస్తున్న హామీలతో జనాలు ఎక్కడ వైసిపికి ఓట్లేస్తారో అన్న భయమే చంద్రబాబులో కనబడుతోంది. కాబట్టి జనాలకు తెలుసు ఎవరికి ఓట్లేయాలో.