టిడిపి ఎంపిల్లో టెన్షన్

తెలుగుదేశంపార్టీ ఎంపిల్లో టెన్షన్ మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి ఘోర ఓటమి ఎదురైన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఎన్నికల్లో గుంటూరు, శ్రీకాకుళం, విజయవాడ పార్లమెంటు స్ధానాల్లో మాత్రమే టిడిపి గెలిచింది. అయితే గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాల్లో టిడిపి గెలిచిన విధానంపై వైసిపి కోర్టులో కేసు వేసింది.

పై రెండు నియోజవర్గాల్లో  ఎన్నికల అధికారులు టిడిపితో కుమ్మకై పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించారంటూ వైసిపి పిటీషన్ వేసింది. ఇక్కడ విషయం ఏమిటంటే టిడిపి అభ్యర్ధులకు వచ్చిన మెజారిటి కన్నా అధికారులు తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లే ఎక్కువ. అందుకే వైసిపి కోర్టులో కేసు వేసి తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను కూడా లెక్కించాలని ఆదేశించాలని కోరింది.

పై రెండు నియోజకవర్గాల్లో గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడుకు వచ్చిన మెజారిటి చాలా తక్కువే. అయితే రిటర్నింగ్ అధికారులు తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లు మాత్రం చాలా ఎక్కువ. గుంటూరులో అయితే 9800, శ్రీకాకుళంలో సుమారు 7వేల పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించారు. పోస్టల్ బ్యాలెట్లున్న కవర్లపై సీరియల్ నెంబర్లు లేవన్న ఏకైక కారణంతోనే అధికారులు తిరస్కరించారు.

ఇదే విషయాన్ని వైసిపి తరపు లాయర్ మాట్లాడుతూ కవర్ పై సీరియల్ నెంబర్లు లేనంత మాత్రాన తిరస్కరించాలని ఎన్నికల సంఘం నిబంధనల్లో ఎక్కడా లేదన్నారు. పైగా సదరు సీరియల్ నెంబర్లు వేసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అన్న నిబంధనను కూడా వివరించారు. రెండు వైపు వాదన విన్న కోర్టు సీరియల్ నెంబర్ల వివాదంపై వివరణ ఇవ్వమని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. మరి ఎన్నికల సంఘం ఎప్పటిలోగా స్పందిస్తుందో చూడాల్సిందే.