చంద్రబాబులో మొదలైన టెన్షన్

Chandra Babu Naidu is struggling as an Opposition leader

చంద్రబాబునాయుడులో టెన్షన్ మొదలైంది. గడచిన మూడు నెలల్లో తెలుగుదేశంపార్టీ నుండి కొందరు కీలక నేతలు వెళ్ళిపోయినా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. కారణం ఏమిటంటే అలా వెళ్ళిన వాళ్ళందరూ చంద్రబాబు అనుమతి తీసుకునే వెళ్ళారు కాబట్టి. టిడిపిలో నుండి బిజెపిలోకి నలుగరు రాజ్యసభ ఎంపిలు ఫిరాయించటం ఇందులో భాగమే.

రాజ్యసభ ఎంపిలు ఫిరాయించిన తర్వాత మరికొందరు కీలక నేతలు కూడా టిడిపికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. వాళ్ళు బిజెపిలో చేరేముందు చంద్రబాబుతో మాట్లాడే వెళ్ళారు. అంటే తన స్వీయ రక్షణ కోసం చంద్రబాబు వాళ్ళందరినీ బిజెపిలోకి పంపారన్నది అర్ధమైపోయింది. రేపు ఎప్పుడైనా టిడిపికి మంచి రోజులు వస్తే మళ్ళీ వాళ్ళందరూ టిడిపిలోకి వచ్చేయటం ఖాయమే కాబట్టి చంద్రబాబులో ఎటువంటి టెన్షన్ కనబడలేదు.

కానీ ఆదివారం మాత్రం చంద్రబాబులో మొదటిసారి  టెన్షన్ కనబడింది. కారణం ఏమిటంటే పార్టీకి సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలోని కీలక నేతల్లో ఒకరైన తోట త్రిమూర్తులు వైసిపిలో చేరారు. చంద్రబాబు లెక్క ప్రకారం టిడిపిని వదిలేస్తే బిజెపిలో చేరాలి కానీ వైసిపిలో చేరటమేంటి ? సరిగ్గా ఇక్కడే చంద్రబాబులో ఆందోళన మొదలైంది.

సమీప భవిష్యత్తులో బిజెపి వల్ల చంద్రబాబుకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కమలం పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు పెట్టేది లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అందులోను బిజెపిలో యాక్టివ్ గా ఉన్నది కూడా టిడిపి నేతలే. అదే టిడిపి నేతలు వైసిపిలో చేరితే ఆ పార్టీ మరింత బలోపేతమవుతుంది.

అసలే మొన్నటి దెబ్బకు చంద్రబాబు కుదేలయ్యున్నారు. దాని మీద మరింతమంది నేతలు వైసిపిలో చేరితే ఇంకేమన్నా ఉందా ? పైగా వైసిపిలో చేరిన తర్వాత తోట మాట్లాడుతూ తొందరలో మరింతమంది నేతలు వైసిపిలో రావటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించటమే చంద్రబాబులో టెన్షన్ కు కారణమైంది.