తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ తగిలింది. పార్టీలో సీనియర్ నేత, మాజీ మంత్రి తోట త్రిమూర్తులు రాజీనామా చేశారు. జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో జరిగిన మద్దతుదారుల సమావేశంలో తోట తన రాజీనామా విషయాన్ని స్వయంగా ప్రకటించారు.
పార్టీకి తోట రాజీనామా చేయబోతున్నట్లు కొంత కాలంగా ప్రచారంలో ఉంది. అయితే చంద్రబాబు పిలిచి మాట్లాడినపుడల్లా తాను పార్టీలోనే ఉంటానని చెబుతూ వచ్చారు. అయితే హఠాత్తుగా రాజీనామా ప్రకటించటం చంద్రబాబుకు షాకిచ్చింది. జిల్లాలోని సీనియర్లలో ఒకరైన తోట కాపు ప్రముఖుల్లో ఒకరుగా చెప్పుకోవాలి.
తాజాగా తోట రాజీనామా చేయటంతో తొందరలోనే మరికొందరు కాపు నేతలు కూడా రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. చంద్రబాబు అమెరికాలో ఉన్నపుడు తోట ఆధ్వర్యంలోనే పార్టీలోని కాపు నేతల రహస్య సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే కాపు నేతల సమావేశం జరిగిన విషయం బయటపడిందో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోయింది.
అప్పటి నుండి ప్రత్యేకంగా కాపు నేతలను చంద్రబాబు దువ్వుతునే ఉన్నారు. అసలే మొన్నటి ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తర్వాత కోలుకోలేదు. అలాంటిది పార్టీకి కాపు నేతలు రాజీనామాలు మొదలవబోతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో టెన్షన్ మరింతగా పెరిగిపోతోంది. మరి ఏం జరగబోతోంది చూడాలి.