తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావనా.. ప్రధాన కుటుంబాలన్నీ దూరం జరుగుతున్నాయా.. నేతలు ఒక్కొక్కరిగా బయటికి వెళ్లి భవిష్యత్తు చూసుకుంటున్నారా అంటే అవును అనేలానే ఉంది వాతావరణం. ఎన్నికల్లో ఓడిపోయిన తక్షణమే ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించడం చేయలేదు. అప్పటికింకా చంద్రబాబు మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్లంతా ఆగారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న బాబు ఏదో ఒకటి చేసి పార్టీని నిలబడతారని అనుకున్నారు. కానీ ప్రతిపక్షంలో కూర్చొని ఏడాదిన్నర గడుస్తున్నా పార్టీకి మేలు జరిగే ఒక్క పనీ చేయలేకపోయారు. ఇప్పుడంటే పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్ష పదవులు, కార్యవర్గం అంటూ హడావుడి చేస్తున్నారు కానీ 10 రోజుల ముందు వరకు ఎలాంటి కదలికా లేదు.
ఇదే నేతల్లో అభద్రతా భావాన్ని పెంచింది. అందుకే ఒక్కొక్కరూ పార్టీని వీడిపోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు నలుగురు ఎగిరిపోగా ఇంకొకరు ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు చాలరన్నట్టు ఇప్పుడు ఎంపీలు కూడ పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నిన్న చిత్తూరు జిల్లా టీడీపీలో కీలకమైన గల్లా అరుణకుమారి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఎంపీ జయదేవ్ కూడ పార్టీని వీడతారనే ప్రచారం మొదలైంది, ఆయనే గనుక పార్టీ మారితే గుంటూరులో టీడీపీ పీకల్లోతు కష్టాల్లో పడ్డట్టే. ఇక మరొక ఎంపీ కేశినేని నాని సైతం అలానే ఉన్నారు. ఎక్కడా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాలుపంచుకోవట్లేదు. కేవలం తన పార్లమెంట్ పరిధిలోని విషయాలకే పరిమితమవుతున్నారు తప్ప పార్టీ కష్టాల గురించి ఆయనకు పట్టింపులేదు.
అలాగే మరొక ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. అచ్చెన్నాయుడు అరెస్ట్, బెయిల్ ఆలస్యం అవడం కారణంగా ఆయన అధిష్టానం మీద గుర్రుగా ఉన్నారట. అంతేకాదుకొన్నిరోజుల క్రితం పార్టీ అధ్యక్ష పదవి ఆయనకేననే ప్రచారం జోరుగా నడిచింది. కానీ లోకేష్ మూలాన అది కాస్త చెడిందని అంటుంటారు. పదవి తమ కుటుంబంలోనే ఉన్నా తనకు రాలేదనే కినుకు ఆయనలో ఉందని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఇలా ప్రధానమైన మూడు జిల్లాల్లో మూడు కుటుంబాల నాయకులు, అందులోనూ ఎంపీలు ఎడ్జ్ ఆఫ్ థి సీట్ అనే తరహాలో ఉన్నారు. ఇప్పుడు వారికి ఏమాత్రం ఇబ్బంది కలిగిన పార్టీకి గుడ్ బై చెప్పేసే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదమే గనుక సంభవిస్తే ఇక టీడీపీలో చూసుకోవడానికి ఏమీ మిగలదు.. మిగిలేదల్లా ఆయా జిలాల్లో పార్టీని మోసుకోవడమే.