కేజీఎఫ్ 2 షూటింగ్ ప్రారంభం నుంచి రకరకాల వివాదాలతో మేకర్స్ సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు కోలార్ బంగారు గనుల్లో షూటింగులకు అనుమతి నిరాకరించారు. ఆ పరిసరాల్లో షూటింగ్ చేస్తుండగా స్థానికులు కోర్టు కేసులు వేసారు. కానీ చివరికి కోర్టుల పరిధిలో పోరాడి కేజీఎఫ్ టీమ్ విజయం సాధించింది.
ఇక కేజీఎఫ్ మెజారిటీ చిత్రీకరణ పూర్తవ్వగా.. పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ప్రశాంత్ నీల్ బృందం సిద్ధమవుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో మరోసారి ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటూ కేసు వేయడం సంచలనమైంది. ముంబై పేలుళ్ల కేసులో దోషిగా పరిగణించిన సంజయ్ దత్ కి కేజీఎఫ్ 2లో నటించే అవకాశం ఎలా ఇచ్చారు? అంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ కేసును కూడా కేజీఎఫ్ 2 టీమ్ నెగ్గింది. అసలు కోర్టు శిక్ష అనుభవించిన వ్యక్తి నటించకూడదని రూల్ ఎక్కడా లేదు! అంటూ జడ్జి కేసును కొట్టి వేశారు. నిజానికి ప్రజా ప్రయోజన వ్యాజ్యం అని ఇలా కేసులు వేయడం సరైనదేనా? అయిన దానికి కాని దానికి ఇలాంటి కేసులు వేసి ప్రజల సమయం జడ్జీల సమయం కోర్టు సమయం వృథా చేయడం సరైనదేనా? అన్నది ఆలోచించాలి. ఇక సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీరా అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్ కి అభిమానుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. త్వరలో అధీరా పాత్రపై భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించాల్సి ఉండగా.. సంజయ్ దత్ కి ఊపిరి తిత్తుల క్యాన్సర్ రావడం సమస్యాత్మకమైంది. దత్ కి అమెరికాలో క్యాన్సర్ చికిత్స జరగనుంది. ఆయన తిరిగొచ్చాక కొంత గ్యాప్ తర్వాత చిత్రీకరణకు వెళతారట.