ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి పార్టీల్లో కలవరం మొదలైంది. ఎందుకంటే, ఓట్లు వేసేందుకు తెలంగాణా నుండి లక్షలాది మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్ కు వెళుతున్నారు. ఏపి ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు తరలి వెళుతున్న వారిలో ఎవరికి ఓట్లు వేస్తారో అనే టెన్షన్ మొదలైంది. తెలంగాణా వ్యాప్తంగా ఏపికి సంబంధించిన ఓటర్లు సుమారుగా 18 లక్షల మంది ఉన్నారని అంచనా.
ఈ ఓటర్లలో ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి, కుకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజగ్ గిరి, చేవెళ్ళు, రాజేంద్రనగర్, ఉప్పల్, ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, సికింద్రాబాద్, ముషీరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జల్లాల పరిధిలో ఎక్కువగా ఉంటున్నారు. మామూలుగా అయితే వీళ్ళల్లో అత్యధికులకు ఇటు తెలంగాణాతో పాటు అటు ఏపిలో కూడా ఓటు హక్కుంది.
తెలంగాణాలో, ఏపిల్లో ఎన్నికల తేదీలు వేర్వేరుగా ఉండటం వల్ల రెండు చోట్లా ఓట్లు వేసే వారు. కానీ రేపటి ఎన్నికల్లో ఎక్కడో ఒకచోట మాత్రమే ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లోను పోలింత్ తేదీ ఒకటే అయ్యింది. దాంతో మొన్నటి తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో ఓట్లు వేశారు కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు వేయటానికి ఏపికి బయలుదేరారు.
మొన్నటి తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళంతా తెలుగుదేశంపార్టీకి వ్యతిరేకంగా ఓట్లేశారు. ఎందుకంటే, పైన చెప్పిన నియోజకవర్గాల్లో టిడిపికి ఒక్క సీటు కూడా రాలేదు. కాబట్టి రేపటి ఎన్నికల్లో కూడా వీళ్ళంతా టిడిపికి వ్యతిరేకంగానే ఓట్లేస్తారనే అనుమానం ఉంది. అందుకే ఇన్ని లక్షల మంది వ్యతిరేకంగా ఓట్లేస్తే తమ గతేమవుతుందో అన్న టెన్షన్ టిడిపి నేతల్లో మొదలైంది.