ప్రస్తుతం ఏపీలో రాజకీయంగా బీజేపీ పరిస్థితి ఏమిటి అని అంటే… రాజకీయాల్లో కనీసం అవగాహన ఉన్నవారెవరైనా ఇట్టే చెప్పేస్తారు. గడిచిన ఎన్నిక ఫలితాలను గమనిస్తే… నోటాతో పోటీపడిన పరిస్థితి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధ్యక్షులు మారారే తప్ప పార్టీ పరిస్థితి మెరుగుపడింది లేదని అంటుంటారు. ఈ సమయంలో పురందేశ్వరి భారీ డైలాగ్ ఒకటి వేశారు!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న సమయంలో మధ్య మధ్యలో బీజేపీ నేతలు చేసే వ్యాఖ్యలు కాస్త రిలీఫ్ ని కలిగిస్తుంటాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందని దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు.
ఇదే క్రమంలో… అధికారంలోకి వచ్చేస్తున్నామన్న భావనతోనే నేతలు, కార్యకర్తలు అంతా కలిసి పనిచేయాలని ఆమె చెప్పారు. ఇదే సమయంలో… జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అనుబంధ విభాగాల కార్యవర్గాలతో పురందేశ్వరి సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఆ పార్టీలోని నేతలు, క్యాడర్ కలిసికట్టుగా పనిచేస్తే అధికారంలోకి రావటం పెద్ద కష్టంకాదని చెప్పుకొచ్చారు.
దీంతో పార్టీ అధికారంలోకి రావటం సంగతి దేవుడెరుగు.. అసలు 175 నియోజకవర్గాల్లో పోటీచేయటానికి అభ్యర్ధులు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇంకా గట్టిగా మాట్లాడితే… పార్టీ తరపున పోటీచేయటానికి పట్టుమని పది నియోజకవర్గాల్లో కూడ్దా గట్టి అభ్యర్ధులు లేరు.
ఇక ఒకసారి వెనక్కి వెళ్లి 2019 లో జరిగిన ఎన్నికల ఫలితాలను గమనిస్తే… ఒంటరిగా పోటీచేస్తే ఒక్క నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కూడా దక్కని పరిస్థితి. ఇక ఈ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 0.59. దీంతో… కనీసం 1 శాతం ఓట్లు కూడా లేని పార్టీ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పడం అంటే… ఎవరిని వెర్రివాళ్లను చేస్తున్నట్లో అని కామెంట్ చేస్తున్నారు.
ఇక ఏపీబీజేపీ కొత్త అధ్యక్షురాలి విషయానికొస్తే.. గత ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీచేసిన పురందేశ్వరికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో… రాబోయే ఎన్నికల్లో కూడా ఇంతకుమించి ఏదో ఉంటుందని అనుకునేందుకు కూడా లేదు. కారణం… విభజన హామీలను తుంగలో తొక్కేయటంతోపాటు… వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేస్తుండటం!
పైగా గతకొంతకాలంగా మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పనులు, ఒంటుద్దు పోకడలకు ఏపీలోని ప్రజలు పూర్తిగా విసిగిపోయారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… మోడీ పేరెత్తినా, బీజేపీ పేరెత్తినా… గతంలోలాగానే ఒక్క శాతం ఓటు కూడా వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు.
మరి జనసేనతో కలిసి వెళ్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారో.. లేక, మూడు పార్టీలతో కలిసి ముందుకు వెళ్తాం అని అనుకుంటునారో కానీ… రాబోయే రోజుల్లో అధికారం బీజేపీది అని చెప్పుకుంటున్నారు పురందేశ్వరి! దీంతో… సీరియస్ పాలిటిక్స్ లో ఈ మాత్రం రిలాక్సేషన్ ఉండాలిలే అని అంటున్నారు విశ్లేషకులు! ఇదే సమయంలో ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతుందంట అనే సామెతను గుర్తుచేస్తున్నారు నెటిజన్లు!