కర్నూలు జిల్లాలో ఫిరాయింపు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డికి కొత్త టెన్షన్ మొదలైంది. ఉరుము ఉరిమి మంగళం మీద పడిందన్నట్లు అటు తిరిగి ఇటు తిరిగి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టిడిపి చేరికతో ఎస్వీ సీటుకే ఎసరు వచ్చేట్లుంది. ఎస్వీకి టిక్కెట్టు రానీయకుండా ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి అండ్ కో చురుగ్గా పావులు కదుపుతున్నారట. సీనియర్ నేత కోట్ల కుటుంబం తెలుగుదేశంపార్టీలో చేరే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. తాను టిడిపిలో చేరుతున్నట్లు ఎవరికీ చెప్పలేదని బుకాయిస్తున్నప్పటికీ కోట్ల టిడిపిలో చేరిక దాదాపు ఖాయమైందనే అనుకోవాలి.
కర్నూలు ఎంపిగా తనకు, ఆలూరు, డోన్ లో తన భార్య, కొడుక్కి అసెంబ్లీ టిక్కెట్లు అడిగారట కోట్ల. ఎంపి టిక్కెట్టు, ఆలూరు అసెంబ్లీ వరకూ చంద్రబాబుకు ఇబ్బంది లేదు. డోన్ దగ్గరే సమస్యంతా వస్తోంది. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో డోన్ లో టిడిపి తరపున కెఇ ప్రభాకర్ పోటీ చేసి ఓడిపోయారు. ప్రభాకర్ అంటే స్వయానా కెఇ కృష్ణమూర్తి తమ్ముడే. అందుకే చంద్రబాబు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. కెఇ ప్రభాకర్ కు టిక్కెట్టు కాదంటే ఏమి సమస్యలొస్తాయో అని చంద్రబాబు లెక్కలేసుకుంటున్నారు.
ఇటువంటి సమయంలోనే కెఇ సోదరులు పావులు కదుపుతున్నారు. కోట్ల భార్య సుజాతమ్మకు డోన్ అసెంబ్లీకి బదులు కర్నూలు అసెంబ్లీ కేటాయిస్తే బాగుంటుందని సూచించారట. ఎంపిగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో భర్త, ఎంఎల్ఏగా భార్య పోటీ చేస్తే అన్నీ విధాలుగా పార్టీకి లాభిస్తుందని చెప్పారట. ఇందులో కెఇ స్వార్ధమేంటో అందరికీ తెలుస్తోంది. కెఇ ప్రతిపాదన వెనుక మరో కారణం కూడా ఉంది. ఎస్వీకి టిక్కెట్టిచ్చినా గెలవరని చంద్రబాబు చేయించుకుంటున్న సర్వేల్లోనే తేలిందట. కాబట్టి ఓడిపోయే అభ్యర్ధికి టిక్కెట్టిచ్చే బదులు అదేదో కోట్ల సుజాతమ్మకే ఇస్తే బాగుంటుందన్నది కెఇ సోదరుల లాజిక్. మరి వాళ్ళ లాజిక్ వినటానికి బాగానే ఉంది కానీ డోన్ లో ప్రభాకర్ మాత్రం గెలుస్తారని గ్యారెంటీ ఏమిటి ? ఆ విషయం మాత్రం అడక్కూడదు.