జవహర్ కు టిడిపి నేతల షాక్

తెలుగుదేశంపార్టీకి బలమైన నియోజకవర్గాల్లో ఒకటిగా ప్రచారంలో ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో పునాదులు కదిలిపోతున్నాయి. జిల్లాలోని మంత్రి కెఎస్ జవహర్ కు వ్యతిరేకంగా పార్టీలోని బలమైన నేతలంతా ఏకమయ్యారు. దాంతో నియోజకవర్గంలో ఒక వర్గానికి మరో వర్గం సహకరించకుండా ఎవరికి వారుగా రాజకీయాలు చేస్తున్నారు. దాంతో వ్యతిరేక వర్గాలన్నీ ఏకమై జవహర్ ను అసలు మంత్రిగా గుర్తించటమే మానేశారు. దాంతో మంత్రివర్గం కూడా వ్యతిరేక వర్గాలపై తీవ్రస్ధాయిలో మండిపోతోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు నియోజకవర్గంలోని వర్గ విభేదాలు తీవ్రస్ధాయికి చేరుకోవటంతో రేపటి ఎన్నికల్లో పార్టీ గెలుపుపై అందరిలోను ఆందోళన ఎక్కువైపోతోంది.

ఎక్సైజ్ శాఖ మంత్రిగా జవహర్ బాధ్యతలు తీసుకున్న తర్వాతే గ్రూపుల గోల ఎక్కువైపోయింది. అంతకుముందు కెఎస్ జవహర్ పై పెద్దగా ఎవరికీ వ్యతిరేకత లేదనే చెప్పాలి. మరి మంత్రైన తర్వాతే గ్రూపుల గోల ఎందుకు మొదలైంది ? ఎందుకంటే, మంత్రయిన తర్వాత జవహర్ వ్యవహారశైలిలో మార్పు మొదలైంది. టీచర్ గా ఉన్న జవహర్ పోయిన ఎన్నికల్లో టిడిపి తరపున  పోటీ చేసి గెలిచారు. మంత్రయ్యే వరకూ మిగిలిన ఎంఎల్ఏల్లో ఒకరుగా ఉన్నారు కాబట్టి తేడా ఏమీ కనబడలేదు. ఎప్పుడైతే మంత్రయ్యారో వైఖరిలో తేడా మొదలైందట. దాన్ని సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోయారు. దాంతో విభేదాలు మొదలయ్యాయి. దానికితోడు విభేదాలను పరిష్కరించుకోవటంలో మంత్రి కూడా తన వైపు నుండి ప్రయత్నాలు చేయకపోవటం కూడా ఓ కారణం.

జవహర్ పై ఏ స్ధాయిలో అసంతృప్తి పెరిగిపియందంటే, ప్రభుత్వం కావచ్చు లేదా పార్టీ కావచ్చు నియోజకవర్గంలో చేపట్టే ఏ కార్యక్రమంలోను వ్యతిరేక వర్గం నేతలు పాల్గొనటం లేదు.  ప్రతీ కార్యక్రమాన్ని తాము విడిగా చేసుకుంటున్నారు. ఆ కార్యక్రమాలకు మంత్రిని పిలవటం లేదు. ఈ మధ్య నియోజకవర్గంలో వన భోజనాల పేరుతో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి వ్యతిరేకులే కనబడ్డారు. అంటే జవహర్ వ్యతిరేకులంతా కలవటానికి వనభోజనాల పేరుతో ఓ సమావేశం పెట్టుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దాంతో మంత్రి అందరిపై మండిపోతున్నారు.

ఈమధ్యే మంత్రి వైఖరిపై వ్యతిరేకవర్గం అంతా జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ముందు పంచాయితీ పెట్టారు. మంత్రిపై ఫిర్యాదులు చేశారన్న విషయం బయటపడగానే టెన్షన్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో జవహర్ కే టిక్కెట్టిస్తే గెలుపు కష్టమని, తామెవరమూ పనిచేయమని వ్యతిరేక వర్గం స్పష్టంగా చెప్పేసిందట. మొదటినుండి పార్టీలోనే ఉన్న సీనియర్ నేత అచ్చిబాబును మంత్రి కావాలనే అవమానిస్తున్నట్లు వ్యతిరేకవర్గం ఫిర్యాదులు చేసింది. మంత్రి ఈమధ్యే పూర్తిచేసిన 100 కిలోమీటర్ల పాదయాత్రలో తనకు వ్యతిరేకులుగా ముద్రపడ్డ నేతలెవరూ కనబడక పోవటంతో జవహర్ కు బాగా మండుతోంది. మొత్తానికి పెరిగిపోతున్న అంతర్గత విభేదాలతో కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కొక్క దాని పునాదులు కదులుతున్నట్లే స్పష్టమవుతోంది. మరి వచ్చే ఎన్నికల్లో టిడిపి పరిస్ధితి ఎలాగుంటుందో చూడాల్సిందే.