విజయవాడలో టీడీపీ, వైసీపీ మధ్య టెన్షన్ టెన్షన్

విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ హాల్ లో చంద్రబాబు ఫోటో పెట్టడంపై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. వైఎస్సార్ ఫోటో పెట్టాలంటూ వైసీపీ కార్పొరేటర్లు మేయర్ పోడియం దగ్గర ఆందోళనకు దిగారు. ఈ వివాదంలో ఇద్దరు కౌన్సిలర్లను సస్పెండ్ చేశారు మేయర్ కోనేరు శ్రీధర్. దీంతో కౌన్సిల్ హాల్ దగ్గర నిరసనకు దిగారు వైసీపీ కార్పొరేటర్లు. దీనికి సంబంధించిన సమాచారం కింద ఉంది చదవండి.

శనివారం మున్సిపల్ కార్పొరేషన్ లో సాధారణ సమావేశాలు జరిగాయి. మున్సిపల్ హాల్ లో చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది. అయితే ఈ ఫొటోతో పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో కూడా పెట్టాలంటూ వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. గతంలో ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన ఫోటో పెట్టలేదని, కేవలం చంద్రబాబు నాయుడు ఫోటోనే పెట్టారని వారంతా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డికి కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని, ఆయన ఫోటో కూడా పెట్టాలంటూ మేయర్ కోనేరు శ్రీధర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు వైసీపీ కార్పొరేటర్లు.

వైఎస్సార్ ఫోటో పెట్టాలంటూ నినాదాలు చేశారు. బాబు ఫోటో పెట్టి వైఎస్సార్ ఫోటో పెట్టకపోవడం సరైన పద్ధతి కాదంటూ వాపోయారు. పోడియం వద్ద నుండి మేయర్ ని ఎటూ కదలకుండా అడ్డుకున్నారు. అయితే ఇది సరైన పద్ధతి కాదు, మీ సీట్లలోకి తక్షణమే వెళ్లి కూర్చోవాలంటూ వైసీపీ కార్పొరేటర్లను వారించారు మేయర్. అయినప్పటికీ వైసీపీ వర్గం వెనక్కి తగ్గలేదు. దీనిపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి, వైఎస్ ఫోటో వెంటనే పెట్టించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

దీంతో మార్షల్స్ ని పిలిపించి వారిని అక్కడ నుండి పంపించే ప్రయత్నం చేశారు మేయరు. అప్పుడు కూడా వైసీపీ కార్పొరేటర్లు వెనక్కి తగ్గకుండా వైఎస్ ఫోటో పెట్టాలంటూ డిమాండ్ చేశారు. దీంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మేయర్ పక్షపాత ధోరణి వహిస్తున్నారంటూ, వైఎస్ ఫోటో పెట్టాలంటూ కౌన్సిల్ హాల్ వద్ద ఆందోళన చేశారు. మీడియా కవరేజ్ కోసం అదే సమయంలో అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు మేయర్.