పెట్రోల్ పోసుకుని నిరసన, గాంధీ భవన్ వద్ద టెన్షన్.. టెన్షన్

  • సీట్ల కేటాయింపు పై గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. శేరిలింగంపల్లి టికెట్ కోసం  కాంగ్రెస్ నేత భిక్షపతి యాదవ్ తన అనుచరులతో గాంధీ భవన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో ఒక్క సారిగా భిక్షపతి యాదవ్ అనుచరుడు పెట్రోల్  పోసుకోని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్న మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తన అనుచరులతో గాంధీ భవన్ చేరుకొని అక్కడ ఆందోళన చేశారు. 

 

కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఆ సమయంలోనే భిక్షపతి యాదవ్ ప్రధాన అనుచరుడు పెట్రోల్ మీద పోసుకున్నాడు. గమనించిన పోలీసులు అతనిని ఆపి పక్కకు తీసుకెళ్లారు. పోలీసులు గమనించకుంటే పెద్ద ప్రమాదం జరిగేదని నేతలన్నారు. మరికొంత మంది భిక్షపతి యాదవ్ అనుచరులు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. పోలీసులు ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు.

టిడిపి బిసిల పార్టీ అంటారు. మరీ త్యాగం చేయడానికి బిసిల సీటే కావాల్సి వచ్చిందా అని భిక్షపతి యాదవ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ జెండా మోస్తున్న తనకు ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. దీనిపై ఉత్తమ్ , రాహుల్ గాంధీలు పునరాలోచించాలని భిక్షపతి యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి టికెట్ ను పొత్తులో భాగంగా టిడిపికి కేటాయించారు. దీంతో భిక్షపతి యాదవ్ ఆందోళన చేశారు. 

గాంధీ భవన్ కు అసంతృప్తుల నుంచి నిరసనలు వ్యక్తమవుతాయనే ఉద్దేశ్యంతోనే రెండు రోజుల కింద గాంధీ భవన్ కు ప్రైవేటు సెక్యూరిటి ఏర్పాటు చేశారు. ఉత్తమ్ కు కూడా 3+3 ఎస్కార్ట్ తో సెక్యూరిటి పెంచారు. గాంధీ భవన్ వద్ద ఇక ఉద్రిక్త పరిస్థితులు తప్పవనే సమాచారంతో పోలీసులు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు నేతలు రంగంలోకి దిగినా ఆశావాహులు మాత్రం శాంతించడం లేదు.  

మరో వైపు శేరిలింగంపల్లి టిడిపి టికెట్ కోెసం తీవ్ర పోరు ఏర్పడింది. మువ్వల సత్యనారాయణ, భవ్య ప్రసాద్ లు ఇద్దరు టిడిపి తరపును పోటి ప్రారంభించారు. ప్రచారంలో ఎదురుపడ్డ ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. భిక్షపతి యాదవ్ అనుచరులు వెళ్లి టిడిపి నేతలను అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్, టిడిపి కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. శేరిలింగంపల్లిలో, గాంధీ భవన్ లో ఒక్కసారే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.