తెలంగాణ మహా కూటమిలో కుంటి గుర్రాలు

తెలంగాణ మహా కూటమిలో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చామన్న పేరుతో కుంటి గుర్రాలకే ఎక్కువ టికెట్లు ఇచ్చారని కూటమి రెబెల్స్ నేతలు ఆరోపించారు. మాజీ మంత్రులు, కూటమి రెబెల్స్ బోడ జనార్దన్, డాక్టర్ విజయరామారావు హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 

బోడ జనార్దన్ మాట్లాడుతూ కుంతియా, ఉత్తమ్ లు మహా కూటమి పేరుతో ఒక మాయ చేశారన్నారు. మూడు సార్లు ఓడిపోయిన వాళ్లకు టికెట్ ఇవ్వమ్ అంటూనే ఇచ్చారన్నారు. ఇప్పటికైనా కూటమి నేతలు తమకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే తామంతా ఒక ఫ్రంట్ గా ఏర్పడి పోటీచేస్తామని హెచ్చరించారు. నిన్న 40 మందిమి మీటింగ్ పెట్టుకున్నట్లు చెప్పారు. ఈరోజు కూడా మరోసారి మీటింగ్ పెట్టుకుంటామన్నారు. 

తెలంగాణ రెబల్స్ ఫ్రంట్ పేరుతో ఫ్రంట్ గా ఏర్పడి పోటీ చేయబోతున్నట్లు సంకేతాలిచ్చారు. ఇందులో కాంగ్రెస్ పార్టీవాళ్లే ఉంటారని చెప్పారు. అయితే టిఆర్ఎస్ రెబెల్స్, టిడిపి రెబెల్స్ కూడా తమను సంప్రదిస్తున్నారని చెప్పారు.  కాంగ్రెస్ లో 19 మంది కొత్తవాళ్లకు టికెట్లు ఇచ్చారని, వాళ్లంతా టికెట్లు కొన్నవాళ్లే అని విమర్శించారు. 

మాజీ మంత్రి డాక్టర్ విజయరామారావు

సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ విజయరామరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత లోపించిందన్నారు. తమ అనుచరులకు టికెట్లు ఇచ్చుకున్నారని ఆరోపించారు. ఎంపిక చేసిన లిస్ట్ రాహుల్ గాంధీ సూచనమేరకే ఏర్పడిందా? చెప్పాలని డిమాండ్ చేశారు. ప్యారచూట్ లకు టికెట్లు ఇవ్వొద్దన్నా కూడా ఇచ్చారని ఆరోపించారు. పార్టీలో ప్రాధమిక సభ్యత్వం లేనివాళ్లకు టికెట్లు ఎలా ఇచ్చారని నిలదీశారు. రౌడీ షీటర్లు, బ్యాంక్ లను దోపిడీ చేసిన వాళ్లకు, సెటిల్మెంట్లు చేసేవాళ్లకు టికెట్లు ఇచ్చారని విమర్శించారు. 

మరో కూటమి రెబెల్ ధర్మపురి రవీందర్ మాట్లాడుతూ తూతూ మంత్రంగా టికెట్ల కేటాయింపు జరిగిందన్నారు. మూడు సార్లు ఓడిపోయిన వారిని, 30వేలు మెజారిటీ రాని వారిని ఎంపికచేయం అని చెబుతూనే ఎంపిక చేశారని ఆరోపించారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తామని కుంటి గుర్రాలను ఎంచుకున్నారని ఎద్దేవా చేశారు. అడ్లూరి లక్ష్మన్ నాలుగుసార్లు ఓడిపోయినా మళ్లీ ఆయనకే టికెట్ ఇవ్వడంలో అర్థం ఉందా అని ప్రశ్నించారు.