ఇదో కొత్త నాటకం.! ఔను, నాటకం లాగానే కనిపిస్తోంది. తెలంగాణలో చాలా సమస్యలున్నాయ్.! కానీ, అవేవీ తెలంగాణలోని అధికార పార్టీకి కనిపించడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో సమస్యల పట్ల తెలంగాణ మంత్రులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇది కాస్త చిత్రమైన సందర్భమే. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఏర్పడ్డాయి. ఆ సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపించలేదన్న విమర్శలున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్యా బకాయిలున్నాయి. అందునా, తెలంగాణనే ఎక్కువగా బకాయిపడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో వున్న దరిమిలా, ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ ప్రభుత్వానికి మమకారం వుంటే ఆ బాకీలు తీర్చెయ్యాలి కదా.? చంద్రబాబు హయాంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయితే, ఆ రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కూడా హాజరయ్యారు.
‘మేం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సాయం చెయ్యాలనుకున్నాం..’ అంటూ, ఏదో కుంటి సాకు చెప్పి సాయం చేయడం మానేశారు కేసీయార్. ఇప్పుడన్నా ఆ సాయం చేయొచ్చు కదా.? కానీ, అలాంటివేవీ చెయ్యరు. పైగా, విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ వ్యవహారాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తెలంగాణలోని అధికార పార్టీ ప్రయత్నిస్తోంది.
ఏపీలో రోడ్ల గురించీ, ఏపీ ఓటర్లను ఆకట్టుకోవడం గురించీ, మంత్రి హరీష్ రావు తదితరులు చేస్తున్న పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. అవసరమా ఈ పంచాయితీ.?