అయిపోయింది.! జనసేనతో టీడీపీ మైత్రికి చెల్లు చీటీ పడినట్లే.! 20 సీట్లంటూ జనసేన స్థాయిని తగ్గించేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్న వైనాన్ని జనసేన అధినేత ఎప్పుడైతే ప్రస్తావించారో, ఆ క్షణం నుంచీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద దారుణమైన ట్రోలింగ్ మొదలెట్టేశారు తెలుగు తమ్ముళ్ళు. నిజానికి, ఏబీఎన్ రాధాకృష్ణ ద్వారా, ‘జనసేనకు వెయ్యి కోట్లు ఆఫర్ చేసిన టీఆర్ఎస్’ అనే వార్త రావడంలోనే టీడీపీ కుట్ర కోణం బయటపడిపోయింది.
దాంతో, జనసేనాని ఒకింత గట్టిగానే హర్టయ్యారు. అయినాగానీ, సమయం తీసుకున్నారు. టీడీపీ తీరుని ఎండగట్టడానికి ఇంకా మొహమాటపడుతూనే వున్నారు. పవన్ కళ్యాణ్ మీద ‘దత్త పుత్రుడు’ అన్న ముద్ర వేసిందే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. దాన్ని వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారంతే. ఇప్పుడిక టీడీపీ – జనసేన మధ్య బంధం దాదాపు తెగిపోయినట్లేనని అటు టీడీపీ శ్రేణులు, ఇటు జనసేన శ్రేణులూ భావిస్తున్నాయి.
రెండు పార్టీల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం కింది స్థాయిలో కనిపిస్తోంది. అయినా, ‘వైసీపీని ఓడించడం కోసం.. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వం’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నినదిస్తే, పార్టీ క్యాడర్ మరింతగా పలచనైపోతుంది. రేపు.. అంటే, మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో మచిలీపట్నం వేదికగా పవన్ కళ్యాణ్ చేయబోయే ప్రసంగం ఎలా వుంటుందోగానీ.. సోషల్ మీడియాలో అయితే దారుణంగా జనసేన మీద టీడీపీ విషం చిమ్ముతోంది.