తన సొంతూరు యలపర్రులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. యలమర్రు తన సొంత గ్రామం కాదని అన్నారు. అది తన పూర్వికుల ఉన్న గ్రామమని అన్నారు. యలమర్రులో తాను ఎప్పుడూ రాజకీయాలు చేయలేదని మంత్రి కొడాలి నాని వివరించారు. ఈ విషయంలో టీడీపీ నేతలు కొందరు అత్యుత్సాహం చూపిస్తున్నారని.. చంద్రబాబు మెప్పు కోసమే యలపర్రును తన సొంతూరుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో కొన్ని మీడియా సంస్థలు కూడా వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
ఈ నెల 21 తర్వాత వాస్తవాలను మీడియాకు వివరిస్తానని.. అప్పుడే అందరి సంగతి తేలుస్తానని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. యలమర్రు గ్రామంలో మొత్తం 12 వార్డులుండగా, అందులో ఒక్క వార్డు మాత్రమే వైసీపీ చేజిక్కించుకుంది. 11 వార్డులను కైవసం చేసుకుని టీడీపీ సత్తా చాటింది. కొడాలి నాని దురుసు వ్యాఖ్యలే సొంతూర్లో వైసీపీ కొంపముంచాయన్న వాదన వినిపిస్తోంది. ఇక.. తమ పార్టీ నాయకులపై విరుచుకుపడే కొడాని నానిపై టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
వరద తాకిడికి గట్టు తెగితే నీటి వేగం ఎట్లా ఉంటాదో గెలుపు రుచిమరిగిన తెలుగుదేశం కార్యకర్త అంత వేగంగా ఉంటాడని, ఎవడైనా కొట్టుకుపోవాలిసిందేనని కొడాలి నానికి చురకలంటిస్తున్నారు. మంత్రి నాని సొంతూరులో మాత్రమే కాదు నాని నియోకర్గమైన గుడివాడ డివిజన్‌లో కూడా టీడీపీ కాస్తంత పుంజుకుంది. గుడివాడ రూరల్ మండలంలోని 12 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా నాలుగింటిలో టీడీపీ జెండా పాతారు. ఇక టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు సొంతూరైన నిమ్మకూరులో కూడా టీడీపీ బలపర్చిన అభ్యర్థి పడమట దుర్గా శ్రీనివాసరావు 121 ఓట్ల మెజారిటీతో వైసీపీ మద్దతుదారుపై గెలుపొందారు. నిమ్మకూరు పంచాయతీలో 10 వార్డులకు 8 టీడీపీ మద్దతుదారుల సొంతం కావడం గమనార్హం.