ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.? చంద్రబాబు అరెస్టయి, జైలుకు వెళ్ళాక.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నాయి. కొందరు నేతలు మీడియా సాక్షిగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బెదిరిస్తున్నారు. ‘మేం అధికారంలోకి వచ్చాక, ఆ వెంటనే నిన్ను జైల్లో పెడతాం..’ అంటూ హడావిడి చేస్తున్నారు.
నిజమే, ఆంధ్రప్రదేశ్ రాజకీయం మారింది. రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు. ప్రత్యేక హోదా అసలే అవసరం లేదు. ప్రధాన రాజకీయ పార్టీలు, ఈ కక్ష సాధింపు రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాయి. వచ్చే ఎన్నికల్లో ఈ కక్ష సాధింపు రాజకీయాలే కీలకం కానున్నాయి. బీజేపీ – జనసేన అడిగినన్ని సీట్లు ఇచ్చేయాలని టీడీపీ అధినేత ఓ నిర్ణయానికి వచ్చారన్నది తాజాగా రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ.
‘ఎలాగైనా, వైఎస్ జగన్ అధికార పీఠం నుంచి దిగిపోవాలి. నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చినా రాకపోయినా ఫర్లేదు.. జగన్ మాత్రం మళ్ళీ అధికార పీఠమెక్కకూడదు. జగన్, అధికార పీఠం దిగిపోగానే, ఆయన్ని జైల్లో పెట్టాలి..’ అనే కండిషన్‌తో చంద్రబాబు, బీజేపీ దగ్గర ఓ ప్రతిపాదన పెట్టారన్న ప్రచారం జరుగుతోంది.
‘మేం అధికారంలోకి వస్తాం.. నిన్ను లోపలకు పంపుతాం జగన్..’ అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంటే, సీట్ల పంపకం విషయమై ఇప్పటిదాకా తటపటాయించిన చంద్రబాబు, జనసేనకు పూర్తి అడ్వాంటేజ్ ఇచ్చేయడానికే సిద్ధమయ్యారని అనుకోవాలి. టీడీపీ శ్రేణులు కూడా, ‘ఈసారికి జనసేనకు పూర్తిగా సహకరిద్దాం..’ అనే ఆలోచనతో వున్నాయ్.!
చంద్రబాబు అరెస్టుతో వైఎస్ జగన్, టీడీపీ – జనసేన – బీజేపీలను కలపగలిగారు. అయితే, బీజేపీ ఇంకా మీనమేషాల్లెక్కెడుతోంది. బీజేపీని తమవైపుకు తిప్పుకోవడంలో జగన్ సక్సెస్ అయితే, సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి రాజకీయ ప్రత్యర్థి వుండకపోవచ్చు. అదే జరిగితే, టీడీపీ శపథాలు, జనసేన ఘీంకారాలు.. అన్నీ తుస్సుమన్నట్టే.!