ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన పులివెందులపై టీడీపీ నాయకులు దృష్టి సారించారు. వైసీపీ అధినేత జగన్‌కు రాజకీయ చదరంగంలో చాలా కీలకమైన ఈ నియోజకవర్గంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మునిసిపాలిటీలు గెలుచుకున్న టీడీపీ కూటమి ఇప్పుడు పులివెందుల మునిసిపాలిటీని తమ ఆధిపత్యంలోకి తీసుకురావాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.
ప్రస్తుత రాజకీయ సమీకరణాలను చూసుకుంటే, టీడీపీ నేతలు స్థానికంగా బలమైన నాయకులను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా వైసీపీ కౌన్సిలర్ షాహిదా టీడీపీలో చేరారు. దీంతో ఆయన అనుచరులైన మైనారిటీ నాయకులు కూడా టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇది స్థానిక రాజకీయాలలో టీడీపీకి ఊపునిచ్చే పరిణామంగా మారింది.

ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్‌పై పోటీ చేసి ఓడిన ఆయన, ఇప్పుడు స్థానికంగా తన పట్టు పెంచుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. వార్డు స్థాయిలో మద్దతుదారులను పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించారు.
తొలుత మునిసిపాలిటీపై ప్రభావం చూపే స్థాయిలో బలాన్ని పెంచుకోవడం, తదనంతరం నియోజకవర్గ స్థాయిలో సమీకరణాలను మారుస్తూ ముందుకు వెళ్లే లక్ష్యంతో టీడీపీ వ్యూహం కొనసాగుతోంది. ఈ మార్పులు వైసీపీకి ఊహించని షాకివ్వవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి జగన్ ఈ పరిణామాలను ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.

