టీడీపీ ‘కాపు’ ఉచ్చులో వైసీపీ ఇరుక్కుందా.?

2024 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం, రాష్ట్ర రాజకీయాలపై చూపబోయే ఇంపాక్ట్ విషయమై మూడు ప్రధాన రాజకీయ పార్టీలు కిందా మీదా పడుతున్నాయి. ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకు గంప గుత్తగా ఎటువైపు తిరుగుతుంది.? అన్న విషయమై ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి.

టీడీపీని కమ్మ పార్టీగా చూడాల్సి వస్తే, వైసీపీని రెడ్ల పార్టీగా చూడాలి. ఆ లెక్కన, జనసేన పార్టీని ‘కాపు’ పార్టీగా చూడాల్సి వస్తుంది. అసలు రాజకీయాల్లో నిస్సిగ్గుగా ఈ కులాల ప్రస్తావన ఏంటి.. అంటే, కుల ప్రస్తావన లేకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం చేయడం అసాధ్యం ఏ రాజకీయ పార్టీకి అయినా.

జనసేన పార్టీ వైపు కాపు ఓటు బ్యాంకు గంప గుత్తగా వెళుతుందేమోనన్న ఆందోళన వైసీపీకి వుంది. 2019 ఎన్నికలకీ, 2024 ఎన్నికలకీ చాలా తేడా వుంది మరి.! అయితే, ‘కమ్మ’ పార్టీ టీడీపీతో జనసేన అంటకాగుతున్న దరిమిలా, కాపు సామాజిక వర్గంలో చీలిక వస్తుందనే చిన్న నమ్మకం అయితే వైసీపీకి లేకపోలేదు.

మరోపక్క, కాపు సామాజిక వర్గాన్ని దువ్వడానికి నానా రకాల ప్రయత్నాలూ చేస్తున్నారు చంద్రబాబు. జనసేన రూపంలో తమకు అదనపు బలం సమకూరినా, కాపు సామాజిక వర్గం జనసేన పార్టీని గనుక ఓన్ చేసుకోకపోతే ఏంటి.? అన్నది చంద్రబాబు ఆందోళన.

వైసీపీ వైపు కాపు నేత ముద్రగడ పద్మనాభం వున్నారు. జనసేన వైపు కాపు నేత చేగొండి హరిరామజోగయ్య వున్నారు. ముద్రగడ రేపో మాపో వైసీపీలో చేరతారు, వైసీపీ నుంచి పోటీ చేస్తారు కూడా. చేగొండి హరిరామజోగయ్యకు ఆరోగ్య పరిస్థితులు సహకరించడంలేదాయె.

జనసేనకు అనుకూలంగా హరిరామ జోగయ్య లేఖలు వదలడం తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఫేక్ లేఖల్ని సృష్టిస్తోంది వైసీపీ చాటుమాటుగా. వాటిపైన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వైసీపీనే, జనసేన మీద సెటైర్లు వేస్తుండడం గమనార్హం. తీరా అవి ఫేక్ లెటర్స్ అని తేలిపోవడంతో వైసీపీ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతోంది.

ఈ తరహా మైండ్ గేమ్స్ వల్ల వైసీపీకి అదనంగా ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదని వైఎస్ జగన్ తెలుసుకుంటే మంచిది. ఆయన ఇలాంటివి ప్రోత్సహించకపోవచ్చు. కానీ, కింది స్థాయిలో కొందరి ‘తుత్తర’ వల్ల వైసీపీకి కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసే ప్రమాదం లేకపోలేదు.