విజయసాయి రెడ్డిని బలిపశువుగా మారుస్తున్నారా ?

TDP will implement strategies on Vijayasaireddy to pull down him

ముఖ్యమంత్రి జగన్ కి నమ్మిన బంటు కుడి భుజంగా ఉన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి జగన్ కి అన్ని విషయాలూ చెప్పి మరీ విశాఖలో ఆపరేషన్ టీడీపీని స్టార్ట్ చేయించారని అనుకుంటున్నారు. తమ్ముళ్ళు కూడా గట్టిగా విశ్వసిస్తున్నారు. దాంతో వారు విజయసాయిరెడ్డి మీదనే కారాలూ మిరియాలూ నూరుతున్నారు.జగన్ చెబితేనే ఏ పని అయినా విజయసాయిరెడ్డి చేస్తారు. కానీ స్వపక్షం విపక్షం సైతం విజయసాయిరెడ్డినే పాపాల భైరవుడిగా చిత్రీకరిస్తోంది. ప్రతీ దానికీ ఆయన్ని ముడిపెట్టి తమ్ముళ్లు విమర్శలు చేస్తున్నారు. నెల్లూరు నుంచి వచ్చిన రెడ్డిని తిరిగి అక్కడికే పంపిస్తామని కూడా ఘాటైన పదజాలమే టీడీపీ వాడుతోంది అంటే ఎంతలా ఫ్రస్టేషన్ లో ఆ పార్టీ ఉందో అర్ధం చేసుకోవాలి. ఇక విజయసాయిరెడ్డి చిట్టా మొత్తం దగ్గర పెట్టుకుని టీడీపీ అక్రమాల గుట్టుని బయట పెడుతున్నారు.

విశాఖలో నిజానికి టీడీపీకే బలం ఉంది. చెక్కుచెదరని కార్యకర్తల బలం ఆ పార్టీ సొంతం. అటువంటి టీడీపీని కూసాలతో సహా కదిలించేందుకు విజయసాయిరెడ్డి వేస్తున్న ఎత్తులతో పసుపు పార్టీ బెంబేలెత్తుతోంది. ఒక పద్మవ్యూహాన్ని రూపొందించి మరీ గట్టి నేతలను విజయసాయిరెడ్డి కట్టడి చేస్తున్నారు. దాంతో జగన్ ప్రభంజనంలో సైతం విశాఖలోని నాలుగు సీట్లూ గెలుచుకుని జబ్బ చరచిన టీడీపీకి అంతలోనే బేలగా మారిపోవాల్సివస్తోంది. ఇక ఇదే విధంగా దూకుడు సాగిస్తే విశాఖలో ప్రతిపక్షానికి నూకలు చెల్లినట్లేనని భావించిన టీడీపీ అధినాయకత్వం ఏకంగా విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ పెద్ద యుధ్ధమే చేస్తోంది.

విజయసాయిరెడ్డి మీద టీడీపీ ఎత్తులు వ్యూహాలు మరో రేంజిలో సాగుతున్నాయి. సొంత పార్టీ వైసీపీ నేతల చేతనే ఆయన మీద నెగిటివిటీ వచ్చేలా చూడడం కూడా ఇందులో భాగమే. ఆయన ఉంటే ఎవరికీ ఏ పనీ కాదన్న భావనను మెల్లగా అధికారపక్షంలో కూడా జొప్పించడంతో టీడీపీ విజయవంతం అయింది. ఈ కారణంగానే ఆ మధ్యనే కొందరు ఎమ్మెల్యేలు సాయిరెడ్డి మీద బాహాటంగా అసంతృప్తిని వెళ్ళగక్కారు. ఇక ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా సైతం జగన్ ని పక్కన పెట్టి విజయసాయిరెడ్డి వెంట పడుతోంది. విశాఖలో శాంతిభద్రతలు లేవని భయపెడుతోంది. ఈ పరిణామాల నేపధ్యంలో సాయిరెడ్డి కూడా గట్టిగానే స్పందిస్తున్నారు. విశాఖను ప్రగతిపధంలో తీసుకెళ్దామనుకుంటే కుట్ర రాజకీయాలు చేస్తున్నారంటూ టీడీపీ మీద అటాక్ చేస్తున్నారు. మొత్తానికి పేరులోనే విజయం ఉంచుకున్న సాయిరెడ్డి ఈ రాజకీయ పోరాటంలో సక్సెస్ అవుతారా లేదా చూడాలి.