తెలుగుదేశం పార్టీ ఎక్కడ.? ఇది జనంలో జరుగుతున్న చర్చ. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ హంగామా పెద్దగా కనిపించడంలేదు. చంద్రబాబు గొంతు చించుకుంటున్నారు.. ఆయన తరఫున వకాల్తా పుచ్చుకునేందుకు టీడీపీ నేతలు మీడియాకెక్కి నానా యాగీ చేస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియా ఎటూ చంద్రబాబుని ఎలివేట్ చేయడం కోసమే పనిచేస్తుంటుందనుకోండి.. అది వేరే సంగతి.
అయితే, కింది స్థాయిలో పరిస్థితులు మారిపోయాయి. కుప్పంలో చంద్రబాబుని ఓడించేందుకు వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. కింది స్థాయిలో ఒకప్పుడు బలమైన క్యాడర్ వున్న టీడీపీ, ఇప్పుడు నాయకత్వ లోపంతో.. దారుణంగా దెబ్బతినేసిన మాట వాస్తవం.
లోకేష్ కారణంగా సీనియర్లు పార్టీకి దూరమయ్యారు.. చంద్రబాబు ముతక రాజకీయాల దెబ్బకి యువనాయకత్వం కూడా ప్రత్యామ్నాయం వెతుక్కుంటోంది. వెరసి, టీడీపీలో నిఖార్సయిన నాయకులు.. అని చెప్పుకోదగ్గవారెవరూ కనిపించడంలేదు.
చంద్రబాబు జనంలో తిరుగుతున్నా, నారా లోకేష్ హంగామా చేస్తున్నా.. ఈ ఇద్దరికీ లేని పోని బిల్డప్ టీడీపీ అనకూల మీడియా ఇస్తున్నా, ‘టీడీపీ ఖేల్ ఖతం..’ అనే మాట అయితే గ్రామ స్థాయిలోనూ వినిపిస్తోంది. ఒకప్పటిలా గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు కనిపించడంలేదు.. అసలు టీడీపీ ఎక్కడా యాక్టివ్‌గా వున్నట్లు కనిపించడంలేదు.
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేనాని క్యాంపెయిన్ ప్రారంభించాక, ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ పడుతున్న పాట్లు.. ఆ పార్టీ ప్రస్తుత దుస్థితిని చెప్పకనే చెప్పేస్తున్నాయ్.!