టీడీపీ, జనసేన స్నేహం.! కత్తుల యుద్ధంలో పొత్తులెలా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది తరచూ అందరూ చెప్పేమాటే.! నిన్న తిట్టుకుంటారు.. నేడు కలిసిపోతుంటారు. రాక్షసుడని విమర్శించినవాళ్ళే, రాముడంటూ ఆయా పార్టీల అధినేతల పంచన చేరుతుంటారు.

ఇక, పొత్తుల వ్యవహారం మరీ హాస్యాస్పదంగా వుంటుంది. టీడీపీ – బీజేపీ మధ్య పొత్తులు, ఆ తర్వాత విమర్శల యుద్ధాలు.. ఇవన్నీ మామూలే. టీడీపీ – జనసేన కూడా అంతే.! 2024 ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయాలనుకుంటున్నాయి.

పెద్దగా డిమాండ్లు పెట్టకుండా, బేషరతుగా తమకు జనసేన మద్దతివ్వాలన్నది టీడీపీ ఉవాచ. తామూ బలం పుంజుకున్నామనీ, తమకూ తగినన్ని సీట్లు అవసరమనీ జనసేన అనుకుంటోంది. కాస్త అటూ ఇటూగా తాము కోరుకున్న సీట్ల లెక్కకు టీడీపీ ఒప్పుకుంటే, టీడీపీతో కలిసి పని చేయాలన్నది జనసేన భావన.

మరీ, గట్టిగా టీడీపీని సీట్ల విషయమై జనసేన డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేదు. చంద్రబాబు మనసులో ఏముంది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఎక్కడికక్కడ జనసేన శ్రేణుల మీద రెచ్చిపోతున్నాయి వైసీపీ శ్రేణులు.

టీడీపీ అనుకూల మీడియా, పూర్తిగా జనసేనను డీగ్రేడ్ చేయడానికే ప్రయత్నిస్తోంది. టీడీపీ పెంచి పోషిస్తోన్న సోషల్ మీడియా టీమ్స్ సంగతి సరే సరి. వాటికి కౌంటర్ ఎటాక్ ఇవ్వడంలో ఈ మధ్య జనసేన కూడా బాగా ముదిరింది. ఈ రెండు పార్టీల మధ్యా పరస్పరం జరుగుతున్న గలాటా చూస్తోంటే.. ముందు ముందు ఈ రెండు పార్టీలు అసలు కలిసి పోటీ చేసే అవకాశం వుంటుందా.? అన్న డౌట్ రావడం సహజమే.

కానీ, ‘ఏం జరిగినాసరే.. కలిసే పోటీ చేస్తాం’ అంటున్నారు జనసేనాని. చిత్రంగా టీడీపీ నుంచి మాత్రం, ‘మేం జనసేనతోనే కలిసి ఎన్నికలకు వెళతాం’ అన్న మాట రావడంలేదు.