వైఎస్ జగన్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం అనేక అనుమానాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసిన వెంటనే లేఖ రాయడం, ఆ మరుసటిరోజే ఆ లేఖ అంశాన్ని మీడియా ముందు పెట్టడం జరిగింది. దీంతో జగన్ ఢిల్లీ వెళ్ళింది న్యాయవ్యవస్థ మీద యుద్ధం చేయడానికి అనుమతులు తీసుకోవడానికనే అనుమానం మొదలైంది జనంలో. చాలామంది విశ్లేషకులు, బీజేపీ ప్రత్యర్థులు ఇదే మాట చెప్పారు. జనం సైతం జగన్ ఢిల్లీ వెళ్లిన వెంటనే ఈ లేఖ వివాదం మొదలవడంతో నిజమే అనుకున్నారు.
ఇంత జరుగుతున్నా బీజేపీ నేతలు ఒక్క మాట కూడ మాట్లాడలేదు. జగన్ ఎన్వీ రమణ మీద లేఖ రాసే విషయమై మోదీ, అమిత్ షాలతో చర్చలు జరపలేదని, అది పూర్తిగా ఆయన స్వీయ నిర్ణయమని, దాని వెనుక ఎవరి ప్రోత్సాహమూ, మద్దతు లేవని ఆ వార్తలను ఖండించలేదు. కేంద్ర, రాష్ట్ర స్థాయి నేతల్లో ఎవ్వరూ ఈ పని చేయలేదు. దీంతో మోదీ అండ చూసుకునే జగన్ ఇలా న్యాయవ్యవస్థ మీకు దాడికి తెగబడ్డారని కొందరు జనం అనుకుంటున్నారు. ఇది ఒక రకంగా బీజేపీ మీద పడిన మరకే అనుకోవాలి. ఈ మరకను చెరుపుకోవడం బీజేపీ పని.
కానీ మీరెందుకు చెరుపుకోడం, చేతులు పాడుచేసుకోవడం మేమున్నాం కదా అంటూ రంగంలోకి దిగిపోయింది టీడీపీ. మొదటి నుండి భారతీయ జనతా పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి కిందా మీదా పడుతూ దొరికిన ప్రతి అవకాశాన్నీ వాడుకుంటున్న బాబు అండ్ కో ఈ అవకాశాన్ని కూడ క్యాష్ చేసుకుని బీజేపీ మెప్పు పొందాలని ప్లాన్ చేసింది. అనుకున్నదే తడవుగా జోస్యం చెప్పడంలో స్పెషలిస్ట్ అయినా సబ్బం హరిని రంగంలోకి దింపింది. సబ్బం హరి మీడియా ముందుకొచ్చి జగన్ లేఖ సంగతి అసలు మోదీ, అమిత్ షాలకు తెలిసే అవకాశం ఉందని తాను అనుకోవడంలేదని, అది కేసులు, శిక్షలకు భయపడి జగన్ ముందు జాగ్రత్తగా వేసిన ప్లాన్ అని తన వెర్షన్ చెబుతూ బీజేపీ మీద నిందలు పడకుండా అడ్డుపడే ప్రయత్నం చేశారు. ఇది చూసిన చాలామంది జనం చేతులు పెట్టి కంపు చేసుకోవడం అనవసరమా బాబుగారు అనుకుంటున్నారు.