జగన్ పాదరక్షలపై తమ్ముళ్లు ఆసక్తి!

సరిగ్గా గమనిస్తే ఏపీలో జగన్ పాలనపై టీడీపీ నేతలు నిర్మాణాత్మకంగా విమర్శలు చేసింది లేదు! కోడికత్తి అని కాసేపు, బాబాయ్ హత్య అని గాసిప్పులు ఇంకాసేపు, సైకో అని మరోవైపు తప్ప… ప్రజలు పునరాలోచించేలా ఒక్క విమర్శకూడా నిర్మాణాత్మకంగా చేసింది లేదు. ఫలితంగా సీఎంగా జగన్ ఇమేజ్ కు ఏ ఇబ్బందీ రావడం లేదు. పైగా… టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై వీడియోలు చూపిస్తూ ఎన్ కౌంటర్ చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ సమయంలో మరో ఆప్షన్ లేకో ఏమో కానీ… జగన్ చెప్పులపై దృష్టి పెట్టారు టీడీపీ సోషల్ మీడియా జనాలు.

గతకొన్ని రోజులుగా వైఎస్ జగన్ వేసుకునే చెప్పుల వైపు తదేకంగా చూస్తున్న టీడీపీ సోషల్ మీడియా జనాలు… ఆ చెప్పులు ఏ బ్రాండ్, వాటి ధర ఎంత, ఎక్కడి నుచి తెప్పించారు వంటి విషయాలపై ఆరా తీశారు. వారికి దొరికిన సమాచారాన్ని వైసీపీ కార్యకర్తలకు అందజేస్తూ… ట్రోల్ చేస్తున్నామని సంబరాలు చేసుకుంటున్నారు. అవును… జగన్ వేసుకునే చెప్పులు ఇటాలియన్ బ్రాండ్ అని చెబుతున్నారు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు. ఎల్విఎంహెచ్ కి చెందిన ఇటాలియన్ బ్రాండ్ బెర్లూటీ చెప్పులను జగన్ వాడుతున్నారని వారు అంటున్నారు. సీఎం జగన్ చెప్పుల ధర 6153 సౌదీ రియాల్స్ అని.. భారత కరెన్సీలో ఈ మొత్తం లక్ష పైనే అని పోస్టులు పెడుతున్నారు.

దీంతో రివర్స్ లో కౌంటర్స్ వేస్తున్నారు నెటిజన్లు. విమర్శలు రాజకీయంగా ఉండాలి తప్ప… ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఏం వేసుకుంటున్నారు అంటూ వ్యక్తిగత విషయాలపై ఉండకూడదని చెబుతున్నారు. జగన్ ఈ చెప్పులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వ ధనాన్ని ఏమీ వినియోగించలేదు కదా అని మరికొందరు నెటిజన్లు కౌంటర్స్ వేస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లో వందల కోట్లు తన ఆస్తులని ప్రకటించుకున్న వ్యక్తికి.. ఇది పెద్ద విషయం కాదనే ఇంగితం లేకపోతే ఎలా అని దుయ్యబడుతున్నారు. ఈ సందర్భంగా… సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన ఒక వృథా ఖర్చును తెరపైకి తెస్తున్నారు నెటిజన్లు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతోపాటు ఆయన కుమారుడు లోకేష్ కూడా… హిమాలయన్ వాటర్ బాటిల్స్ తాగుతున్నారని అప్పట్లో విమర్శలు వచ్చేవి. ఒక్కో హిమాలయన్ వాటర్ బాటిల్ ఖరీదు వేల రూపాయల్లోనే ఉందని ఆన్ లైన్ వేదికగా కామెంట్లు కనిపించేవి. దీంతో… ఆ వాటర్ బాటిల్స్ బిల్లు మొత్తం ప్రభుత్వం నుంచే కట్టిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు నెటిజన్లు! టీడీపీ జనాల ఈ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే… జగన్ వీరిని ఏ స్థాయిలో నిద్రలేకుండా చేస్తున్నారో స్పష్టమవుతుందని అంటున్నారు పరిశీలకులు!