ముద్రగడకి టీడీపీ క్షమాపణ.? తప్పేలా లేదే.!

2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! అందుకే, ఎలాగైనా గెలిచి, అధికారంలోకి రావాలన్న ఆలోచనతో, జనసేన పార్టీని మిత్రపక్షంగా చేసుకుంది తెలుగుదేశం పార్టీ.

టీడీపీ – జనసేన పొత్తుకు సంబంధించి, ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అనే మాట మొదటిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినా, అంతకు ముందు నుంచే జనసేన మీద వలపు బాణాలు విసురుతూ వచ్చింది జనసేన మీద టీడీపీ.

‘జనసేనతో పొత్తుకు సిద్ధమే. కానీ, వన్ సైడ్ ప్రేమ వల్ల ప్రయోజనం వుండదు కదా.?’ అంటూ అంతకు ముందు పలు సందర్భాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఎలాగైతేనేం టీడీపీ – జనసేన కలిశాయి.

అయితే, టీడీపీ – జనసేన కలయికని కాపు సామాజిక వర్గంలో కొందరు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రౌండ్ లెవల్‌లో ఈ ఇబ్బందికర పరిస్థితిని గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు, తాజాగా ముద్రగడ పద్మనాభం దగ్గరకు టీడీపీ ప్రతినిధి బృందాన్ని పంపించారు. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ, టీడీపీ ప్రతినిథిగా ముద్రగడతో భేటీ అయ్యారు.

అంతకన్నా ముందే, జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, ముద్రగడ పద్మనాభంతో భేటీ అయి, జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, టీడీపీలోకి ముద్రగడ పద్మనాభం.. అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై జనసేన ఒకింత గుస్సా అవుతోంది. టీడీపీ మార్కు రాజకీయాలు ఇలాగే వుంటాయ్. గతంలో, అంటే చంద్రబాబు హయాంలో ముద్రగడను ఏ స్థాయిలో వేధించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే, కాపు సామాజిక వర్గ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ముద్రగడ, జనసేనకు మద్దతివ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.