బస్సుయాత్రలో కొత్త టెన్షన్… “భవిష్యత్ కు గ్యారెంటీ” ఇవ్వని తమ్ముళ్లు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకపక్క వారాహియాత్ర అంటూ పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాల్లో రాజకీయ అలజడులు సృష్టిస్తుంటే… మరోపక్క టీడీపీ బస్సు యాత్రలంటూ బయలుదేరింది. అయితే ఈ యాత్రలకు పెట్టిన భవిష్యత్ గ్యారెంటీ పేరుకు టీడీపీ నేతలు న్యాయం చేయడం లేదని తెలుస్తుంది.

అవును… ఈసారి ఎలాగైనా వైసీపీని గద్దె దించాలని టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు కలిసొచ్చే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు కదులుతుంది. పక్క రాష్ట్రాల్లో సక్సెస్ అయిన పథకాలతో మినీ మ్యానిఫెస్టోని కూడా విడుదల చేసేసింది. ఈ సమయంలో “భవిష్యత్ కు గ్యారెంటీ బస్సుయాత్ర” పేరుతో ప్రజల మద్దతు కోసం ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు.

అయితే ఈ బస్సు యాత్ర పుణ్యమాన్ని పార్టీకి ప్రజల్లో పెరిగే మద్దతు ఎంతో తెలియదు కానీ… పార్టీలో వర్గ విభేదాలు మాత్రం తెరపైకి వస్తున్నాయి. అవును… ఏపీలో టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్రలో ఆ పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలు పార్టీ పరువును తీస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే పెనుగొండలో తెలుగు తమ్ముళ్లు ఒకరినొకరు కొట్టుకోగా.. మడకశిరలో ఏకంగా యాత్రను వాయిదా వేసిన పరిస్థితి నెలకొంది.

అవును… అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య గొడవలు తారాస్థాయికి చేరడంతో… బస్సు యాత్ర సాక్షిగా తెలుగు తమ్ముళ్లు ముష్టి యుద్ధాలకు దిగారు. తాజాగా సత్యసాయి జిల్లా పెనుగొండ టిడిపిలో సవితమ్మ, బీకే పార్థసారథి వర్గాల మధ్య బాహాబాహీ వాతావరణం చోటుచేసుకోగా.. మడకశిర లోనూ సీనియర్లు జూనియర్లు మధ్య ఆధిపత్యపోరు రచ్చగా మారింది.

దీంతో చేసేదేమీ లేక మడకశిరలో బస్సు యాత్రను వాయిదా వేసి.. అక్కడ జరగాల్సిన బస్సు యాత్రను కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మార్చారు. దీంతో… చంద్రబాబు ఏదో ఊహించి ఈ కార్యక్రమం పెడితే… మరోదే అవుతుందని ఆందోళన చెందుతున్నారంట టీడీపీ శ్రేణులు. ఇప్పటికే పరిస్థితులు బాగా లేదని అంతా భావిస్తూ.. ఈసారి ఎలాగైనా గెలవక పోతే నిలవలేమని నమ్ముతున్న వేళ.. ఇలాంటి కొట్లాటలు మంచివికావని ఆ నేతలకు సూచిస్తున్నారు.