విజయసాయిరెడ్డిపై కన్నేసిన టీడీపీ.! సాధ్యమేనా.?

వైసీపీ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) విజయసాయిరెడ్డిని తమవైపుకు తిప్పుకునేందుకు తెలుగుదేశం పార్టీ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. బీజేపీ కూడా ఈ తరహా ప్రయత్నాలు చేస్తూనే వుంది. విజయసాయిరెడ్డి మాత్రం పార్టీకి ఎదురు తిరిగేందుకు సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలోనే టీడీపీ తెలివిగా మైండ్ గేమ్ ఇంప్లిమెంట్ చేస్తోంది. సినీ నటుడు తారకరత్న గుండె పోటుకు గురై, బెంగళూరు ఆసుపత్రిలో దాదాపు 23 రోజుల వైద్య చికిత్స పొంది, దురదృస్టవశాత్తూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

తారకరత్న సతీమణి, విజయసాయిరెడ్డికి సమీప బంధువు. ఈ నేపథ్యంలో తారకరత్న వైద్యం దగ్గర్నుంచి, అంత్యక్రియల వరకు.. అన్ని విషయాల్లోనూ టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పెద్దరికం వహించారు విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో చంద్రబాబు – విజయసాయిరెడ్డి తరచూ మాట్లాడుకోవడం, మంతనాలు జరపడం కూడా తప్పనిసరైంది.

అయితే, ఆ చర్చల్లో రాజకీయ అంశాలూ ప్రస్తావనకు వచ్చాయనీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి టీడీపీ షాక్ ఇవ్వడానికి, విజయసాయిరెడ్డి కూడా సాయం చేశారని లీకులు పంపుతోంది టీడీపీ, సోషల్ మీడియాలో తమ కార్యకర్తల ద్వారా. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం కారణంగా విజయసాయిరెడ్డి హవా తగ్గిన మాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే, సజ్జలకు షాకిచ్చేందుకు పార్టీ ప్రయోజనాల్నీ విజయసాయిరెడ్డి పణంగా పెట్టారన్న విమర్శలు వినిపిస్తుండడం సహజమే. అయితే, విజయసాయిరెడ్డి అంత రిస్క్ తీసుకుంటారా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.