టీడీపీ కార్యకర్తని అరెస్ట్ చేసిన సీఐడీ.! వెంగళరావుకి ఊరట.!

టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త వెంగళరావుకి న్యాయస్థానంలో ఊరట లభించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ ఆయన్ని అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. వెంగళరావుని గుంటూరులోని సీఐడీ కోర్టులో న్యాయమూర్తి యెదుట హాజరు పర్చారు ఏపీ సీఐడీ అధికారులు.

కాగా, సీఐడీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టుని న్యాయస్థానం తిరస్కరించింది. సెక్షన్ 41-ఎ నోటీసు ఇవ్వాలని ఏపీ సీఐడీకి న్యాయస్థానం ఆదేశించింది. ‘ఘర్షణ మీడియా’ పేరుతో యూ ట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు వెంగళరావు. ఆ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాల్ని ప్రసారం చేస్తున్నారనీ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారనీ ఏపీ సీఐడీ, వెంగళరావుపై కేసులు నమోదు చేసింది. అరెస్టు చేసింది.

తనకు న్యాయస్థానంలో ఊరట దక్కడంపై టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త వెంగళరావు కోర్టు ఆవరణలోనే హర్షం వ్యక్తం చేశారు. తనను అరెస్టు చేసిన పోలీసులు శారీరకంగా, మానసికంగా వేధించారనీ, చంద్రబాబు అలాగే లోకేష్ పేర్లు చెప్పాల్సిందిగా తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.

రాజధాని, పోలవరం గురించి ప్రశ్నిస్తే వేధింపులా.? వేల కోట్ల ప్రజాధనం దోచుకుంటోంటే తప్పని ప్రశ్నించడం నేరమా.? అంటూ వ్యాఖ్యానించిన వెంగళరావు, అణచివేత అనేది తిరుగుబాటుకి కారణమవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా, గడచిన మూడేళ్ళలో ఏపీ సీఐడీ అరెస్టుల వ్యవహారం ఓ ప్రసహనంగా మారిపోతూ వస్తోంది. ఏపీ సీఐడీ మాత్రమే కాదు, సాధారణ పోలీస్ విభాగం కూడా ఆయా కేసుల్లో నిందితుల్ని అరెస్టు చేసే క్రమంలో నిబంధనలు పాటించని వైనంపై న్యాయస్థానంలో మొట్టికాయలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇంత జరుగుతున్నా, పోలీసు విభాగం ఎందుకు నిబంధనలు పాటించడంలేదు.? ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ఎందుకు వ్యవహరిస్తోంది.? అనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది.

మరోపక్క, ఏదో ఒక లూప్ హోల్ పట్టుకుని, నిందితులు తప్పించుకుంటున్నారన్న భావన అధికార పార్టీలో వ్యక్తమవుతోంది.