తెలుగుదేశం పార్టీ ఆ సంస్కారం నేర్చుకోవాల్సిందే.!

‘ఏం పీకారు..’ అంటూ సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పదే పదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద నోరు జారితే, వైసీపీ నాయకులు ‘హుందాతనం’ ఎందుకు ప్రదర్శిస్తారు.? సహజంగానే ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సాధారణ ప్రజానీకంలోనూ చాలావరకు ఇదే భావన వ్యక్తమవుతుంటుంది.

తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అన్నట్లుంటుంది రాజకీయాల్లో. టీడీపీ నుంచి ఓ విమర్శ వెళితే, వైసీపీ నుంచి నాలుగు విమర్శలు రాకుండా వుంటాయా.? అయితే, అధికార పార్టీ గనుక వైసీపీ ఒకింత బాధ్యతగా మరింత హుందాతనం ప్రదర్శించాల్సి వుంటుంది. కానీ, అక్రమాస్తుల కేసు సహా, చాలా విషయాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ గతంలో వైసీపీని ర్యాగింగ్ చేసింది గనుక, దానికి వడ్డీతో సహా ఇప్పుడు ఆ పార్టీ బదులు తీర్చుకుంటుండొచ్చు.!

అలాగని వైసీపీ చేస్తున్న విమర్శల్నీ, వైసీపీ నాయకులు వాడుతున్న బూతు పదాల్నీ సమర్థించలేం. రాజకీయాల్లో పదే పదే చంద్రబాబు హుందాతనం గురించి మాట్లాడుతుంటారు. సీనియర్ పొలిటీషియన్‌గా ఆయన తొలుత హుందాతనం పాటించాలి. అదే సమయంలో తన కుమారుడు నారా లోకేష్‌కి కూడా హుందాగా వుండమని చెప్పాలి.