జగన్ తో ఇరిగెల సోదరుల భేటీ…చంద్రబాబుకు షాక్

జగన్మోహన్ రెడ్డితో ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు భేటీ అయ్యారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో సోదరులు సమావేశమయ్యారు. తొందరలో టిడిపికి రాజీనామా చేసే ఉద్దేశ్యంతోనే సోదరులిద్దరూ జగన్ తో భేటీ అయ్యారు. కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డలో ఇరిగెల రాంపుల్లారెడ్డికి మంచి పట్టుంది. స్ధానికంగా ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియతో ఏర్పడిన విభేదాలే ఇరిగెల తాజా నిర్ణయానికి ప్రధాన కారణంగా సమాచారం. తాజాగా ఇరిగెల నిర్ణయంతో రేపటి ఎన్నికల్లో ఆళ్ళగడ్డలో ఫిరాయింపు మంత్రికి గెలుపు కష్టమనే చెప్పాలి.

ఎప్పుడైతే అఖిలప్రియ మంత్రయ్యారో అప్పటి నుండే ఇరిగెల సోదరులకు కష్టాలు మొదలయ్యాయి. పార్టీలో వాళ్ళను పట్టించుకునే వాళ్ళే కరువయ్యారు. మాజీ ఎంఎల్ఏ కూడా అయిన ఇరిగెల రాంపుల్లారెడ్డి పార్టీలో తన అణచివేత లక్ష్యంగా జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోయారు. ఇదే విషయాలను చంద్రబాబునాయుడుతో కూడా చెప్పారట. అయినా ఫలితం కనబడలేదు. దానికితోడు రాబోయే ఎన్నికల్లో భూమా ఉండగానే  ఆళ్ళగడ్డ టికెట్ కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దాంతో తనకు టికెట్ దక్కే విషయం కూడా అనుమానమైపోయింది.

పార్టీలో ఉండి లాభం లేదనుకున్న తర్వాత టిడిపి కార్యక్రమాలకు దూరమైపోయారు. షెడ్యూల్ ఎన్నికలు ఎటూ దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా అందుకనే టిడిపిని వదిలేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదె ఆలస్యం వెంటనే జగన్ తో సోదరులిద్దరూ భేటీ అయ్యారు.  ఆళ్ళగడ్డలో టికెట్ విషయంలో మాత్రం ఇరిగెలకు జగన్ ఎటువంటి హామీ ఇవ్వలేదని సమాచారం.