రోడ్డు ప్రమాదంలో గుంటూరు టీడీపీ సీనియర్ నేత మృతి

రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన టిడిపి సీనియర్ నేత మృతి చెందారు. పార్టీకి ఎంతో కృషి చేసి, ఎంతో సౌమ్యుడిగా పేరున్న ఆయన మరణవార్త టిడిపి శ్రేణుల్లో తీవ్ర విషాద ఛాయలు నెలకొల్పింది అని సహచర నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు టిడిపి చిలకలూరిపేట మాజీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రహమాన్. తీవ్ర గాయాలపాలైన ఆయన గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మరణించారు. ఆయన మృతదేహాన్ని మద్దినగర్ లోని సొంత నివాసానికి తీసుకొచ్చారు.

రహమాన్ వయస్సు 46 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో వార్డు కౌన్సిలర్ గా పని చేసిన ఆయన ప్రస్తుతం టిడిపి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ, సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్నారు, పార్టీకి అతీతంగా అందరితోను ఆయన కలుపుగోలుగా వ్యవహరించేవారని సన్నిహితులు వాపోతున్నారు. ఆయన మృతిపట్ల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేసారు. రహమాన్ మృతదేహాన్ని దర్శించి నివాళులు అర్పించారు. రహమాన్ మృతిపై దుఃఖం వ్యక్తం చేసిన ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రహమాన్ మృతి టీడీపీకి తీరని లోటని అన్నారు. రహమాన్ కుటుంబానికి పార్టీ అండదండలు ఉంటాయని భరోసా ఇచ్చారు. కాగా రహమాన్ మృతదేహానికి పలు పార్టీల నేతలు నివాళులర్పించారు. వీరిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, జిడిసిసిబి మాజీ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ కరీముల్లా, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లెల రాజేష్ నాయుడు, పఠాన్ సమద్ ఖాన్, ఎస్ ఎస్ సుబాని, ముద్దన నాగేశ్వరరావు, జవ్వాజి మదన్, పుల్లగూర భక్తవత్సలరావు, అందెల శౌరి తదితరులు ఉన్నారు. మద్దినగర్ లోని ముస్లిం స్మశానవాటికలో బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.