ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఇక తెలుగుదేశం పార్టీకి నారా వారే పర్మినెంట్ అధిపతులు.. నందమూరి వారికి నో ఛాన్స్ అనే కామెంట్లు వినిపించాయి. చంద్రబాబు వ్యూహాలు, పొత్తులు, ఎత్తులకు తోడు వైసీపీ చేసిన తప్పులూ వెరసి కూటమికి భారీ విక్టరీ దక్కింది. ఇందులో టీడీపీకి సొంతంగా 135 సీట్లు లభించాయి.
దీంతో… టీడీపీకి ఇక తిరుగులేదు.. ఇప్పట్లో ఢోకా లేదు అనే స్థాయిలో ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే చంద్రబాబు & కోపై తీవ్ర వ్యతిరేకత వచ్చేసిందనే మాటలు వినిపిస్తున్నాయి. జగనే ఉండి ఉంటే అనే చర్చ ఇప్పటికే ప్రజల్లో మొదలైపోయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
కాస్త అటు ఇటుగా రాజకీయ విశ్లేషకులు కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేస్తున్నారు. సూపర్ సిక్స్ అమలుపై ప్రభుత్వం నోరు మెదకపోవడంతో పాటు.. వందల హామీలు కాకపోయినా, కనీసం ఆ ఆరుహామీలు అయినా నెరవేర్చక పోవడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. ఇది తీవ్ర వ్యతిరేకత తెస్తుందని చెబుతున్నారు.
మరోపక్క టీడీపీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబుకు ఇదే చివరి అని.. నెక్స్ట్ చినబాబు లోకేష్ ఎంట్రీ ఉంటుందని.. 2029 ఎన్నికల నాటికి చినబాబు పట్టాభిషేకాన్ని ప్లాన్ చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… ఇక తెలుగుదేశం పార్టీ పూర్తిగా నందమూరివారికి దూరమైపోయినట్లేనా అనే చర్చ తెరపైకి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఈ చర్చకు బలం చేకూరుస్తూ బుద్దా వెంకన్న లైన్ ల్కి వచ్చారు. తాజాగా మాట్లాడుతూ… టీడీపీలో తాను చంద్రబాబు, భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ నాయకత్వంలో పనిచేస్తాను కానీ.. వేరే ఎవరివద్దా కాదని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగని ఆయన… టీడీపీలో జూనియర్ ఎన్ టీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకునే సమస్యే లేదని కుండ బద్దలు కొట్టారు.
ఇదే సమయంలో… ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కి ఎందరో మనవళ్ళు ఉన్నారని.. వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు మాత్రమే అని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో… ఎన్టీఆర్ మనవడు అంటే నారా లోకేష్ మాత్రమే అన్నట్లుగానే బుద్ధా చెబుతున్నారు. నిజానికి బుద్ధా ఈ విధంగా ఎందుకు మాట్లాడారు అన్నదే చర్చ.
వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు టీడీపీ వారసత్వంపై చర్చ జరిగి ఉంటే ఉండోచ్చు. టీడీపీ మీటింగ్స్ జరుగుతున్న సమయంలో… జూనియర్ ఫ్యాన్స్ అక్కడకు చేరి ‘జై ఎన్టీఆర్’ అని నినాదాలు చేసేవారు.. వారిని నారా ఫ్యాన్స్ పక్కకు ఈడ్చి పడేసేవారు. ఇక 2024 ఎన్నికల ఫలితాల అనంతరం ఆ టాపిక్కే లేదు. వారసత్వం గురించిన చర్చే లేదు.
ఈ సమయంలో వారసత్వం గురించి టాపిక్ ఎత్తారు బుద్ధా వెంకన్న. దీంతో.. ఇపుడు వారసత్వ పోరు లేదు.. అయినా ఆయన వెంకన్న మాట్లాడారు.. అంటే టీడీపీలో ఇంకా ఎవరికైనా పార్టీ వారసత్వంపై సందేహాలు ఉన్నా లేక టీడీపీని ఎప్పటీకైనా తన పార్టీ అని జూనియర్ అంటారని ఆలోచించేవారికైనా కళ్ళు తెరిపించేందుకే అని అంటున్నారు.
ఇదే సమయంలో ఈ రేంజ్ లో లోకేష్ ని లేపితే ఏదైనా పదవి వచ్చే అవకాశం ఉందేమో అనేది వెంకన్న ఆలోచన అని అంటున్నారు. ఏది ఏమైనా… వెంకన్న ఒకందుకు వారసత్వ ప్రస్థావన తెచ్చినట్లు ఉంటే… అది మరో రకం చర్చకు దారి తీస్తుందని చెబుతున్నారు. ఇందులో భాగంగా… పార్టీని స్థాపించిన పెద్దాయనకే ఒకానొక సమయంలో ఎదుదెబ్బ తగిలింది, తాను స్థాపించిన పార్టీల్లోంచే బయటకు గెంటపడ్డ పరిస్థితి.
అటువంటిది… ఎన్టీఆర్ నుంచి లాక్కున్న పార్టీకి అధినేత అయిన చంద్రబాబు నుంచి నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఆ ఛాన్స్ లేదని ఎలా అనుకోగలం అనేది ఇప్పుడు చర్చ. అప్పుడు ఎన్టీఆర్ వద్దు చంద్రబాబు ముద్దు అని నాయకులే అని ఉంటే, అదంతా పార్టీ శ్రేయస్సు కోసమే అని భావిస్తే… మరోసారి అలాంటి పార్టీ శ్రేయస్సు పరిస్థితి, నాయకుల మనోభావల స్థితి తెరపైకి రాదా? పెద్ద డౌటే ఇది!