జగన్ ఓటమి ఖాయమట

అవును అలాగనే చెబుతున్నారు టిడిపి నేతలు. జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం నుండి జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా ఓటమి ఖాయమంటూ రెడ్డి జోస్యం చెప్పారు. జగన్ ఓడిపోవటానికి కారణం ఏమిటంటే, మూడుసార్లు గెలిచిన శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి ఎంఎల్ఏ చేసిందేమీ లేదట. శ్రీకాంత్ మూడుసార్లు గెలిచింది వాస్తవమే అయినా అందులో రెండుసార్లు ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఆ విషయాన్ని టిడిపి జిల్లా అధ్యక్షుడు ఉద్దేశ్యపూర్వకంగానే మరచిపోయారు.

మొదటిసారి శ్రీకాంత్ గెలిచింది 2004లో. అప్పట్లో గండికొట రిజర్వాయర్ నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కృషి చేశారు. ఐదేళ్ళల్లో రిజర్వాయర్ ను దాదాపు పూర్తి చేశారు. దాని ద్వారా రాయచోటికి సాగు, తాగు నీరందించాలన్నది వైఎస్ ఆలోచన. 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవటంతో వైఎస్ రెండోసారి సిఎం అయ్యారు. అప్పుడు శ్రీకాంత్ కూడా గెలిచారు. దాంతో గండికోట పనులు మళ్ళీ ఊపందుకున్నాయి.

అయితే, ఎవరూ ఊహించని రీతిలో సిఎం అయిన కొద్ది రోజుల్లోనే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.  తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసిందే. దాంతో శ్రీకాంత్ ప్రతిపక్ష ఎంఎల్ఏ అయిపోయారు. ఇక, 2014 ఎన్నికల్లో కూడా శ్రీకాంత్ మూడోసారి గెలిచినా ప్రతిపక్ష ఎంఎల్ఏగానే ఉండిపోయారు. ప్రతిపక్ష ఎంఎల్ఏలో కూడా అభివృద్ధి పనులు చేసేంత విశాలహ్రుదయం చంద్రబాబునాయుడుకు ఉందా ?

అందుకనే ఎంఎల్ఏ ఇచ్చిన ప్రతిపాదనలన్నీ బుట్టలోనే పడిపోయాయి. వాస్తవాలు ఇలా వుంటే టిడిపి అధ్యక్షుడు రివర్సులో మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. పైగా శ్రీకాంత్ ఓడిపోతారని చెప్పటంలో తప్పేమీ లేదు. కానీ ఏకంగా జగన్ పోటీ చేసినా ఓటమి తప్పదని చెబుతున్నారంటే కాస్త అతి చేస్తున్నట్లు లేదు ?